పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్- టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ల మధ్య నెలకొన్న ఓ సరాదా ట్వీట్ వివాదానికి దారితీసింది. యువతలో ప్రేరణ నింపే కోట్స్‌తో అక్తర్ చేసిన ట్వీట్‌పై యువరాజ్ స్పందించాడు. మీ కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడటం ఒక్కటే మార్గమని షోయబ్ ట్వీట్ చేశాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉన్నా, క్రికెట్లో కత్తులు దూసుకున్నా అది అక్కడ వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా ఎవరిపైన ఎవరికీ ద్వేషం లేదు. ఇక క్రికెటర్లు అయితే మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్న వీడియోను ఐసీసీ విడుదల చేసింది.
తాజాగా పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ యువతలో స్ఫూర్తినింపే కొటేషన్స్‌తో ఉన్న తన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోను చూసిన యువరాజ్ అతడిని ఆటపట్టిస్తూ ట్వీట్ చేశాడు.సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షోయబ్ తన ఆలోచనలను నిత్యం పంచుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా.. ''కష్టపడడం ద్వారా మాత్రమే కలలను చేరుకోగలం. లక్ష్యాలను చూసి భయపడొద్దు.. కష్టపడడాన్ని ఆపొద్దు'' అంటూ తన ఫొటోతో ఉన్న కోట్స్‌ను ట్వీట్ చేశాడు.షోయబ్ ట్వీట్‌ను చూసిన యువరాజ్ దృష్టి వెంటనే అతడి ఫొటోపై పడింది. కళ్లకు అద్దాలు, చేతిలో హెల్మెట్, చేతికి గ్లోవ్స్ ఉండడం చూసి వెంటనే స్పందించాడు. ''నీవు చెప్పింది బాగుంది.. కానీ వెల్డింగ్ చేయడానికి వెళ్తున్నావా?'' అని ట్వీట్ చేశాడు.అక్తర్ వేషధారణ అలా ఉండడంతో యూవీ ఇలా సరదాగా స్పందించాడు.
క్షణాల్లోనే యూవీ ట్వీట్ వైరల్ అయింది. అతడి సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ అంటూ ట్విట్టర్ యూజర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్తర్ వేషధారణ వెల్డర్ మాదిరిగా ఉండడంతో వెంటనే యూవీ అలా స్పందించాడు. అతడి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ అంటున్నారు.