ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే మరోపక్క సమర శంఖారావం సభ లతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి కేడర్‌ను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా నిర్వహించిన సభలో సంచలన ప్రకటన చేశారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని ఒంటరి గానే పోటీ కి వెళతామని రేణిగుంట లోని యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోజరిగిన సమర శంఖారావ బహిరంగ సభలో ఆయన చెప్పారు. గడచిన కొన్ని ఏళ్లుగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందనిఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అన్ని కేసులు ఎత్తి వేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. "9 ఏళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డారు, మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్లే. మీ అందరి బాగోగులు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటా. రాజకీయంగా, సామజికంగా ఆదుకుంటా. చాలా గర్వంగా చెబుతున్నా మీరందరూ నా కుటుంబసభ్యులే. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.