Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ నేత వద్ద రూ.5 కోట్లు పట్టుకున్న పోలీసులు

Category : politics state

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయం ముంచుకొస్తుండడంతో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. పోలీసులెన్ని చర్యలు తీసుకున్నా నేతలు అడ్డదారుల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో ఏకంగా 5 కోట్ల నగదు పట్టుబడడం నేతల ప్రలోభాల పర్వానికి నిదర్శనం.

రాజాం మండలం జెండాల దిబ్బ దగ్గర పోలీసులు తనిఖీలు జరిపారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెళ్తున్న ఆర్టీసీలో బస్సులో ఏకంగా 5 కోట్ల 7 లక్షల నగదు పట్టుబడింది. అంత నగదును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. బస్సులో ఉన్న వైసీపీ నేత పాలవలస విక్రాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బులు ఎవరివి? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

తెలంగాణలో సైతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో 2 కోట్ల రూపాయలను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచడానికి రాజమండ్రి తరలిస్తున్నట్టు తేలిందని సీపీ సజ్జనార్ తెలిపారు.

మరోవైపు ఇప్పటివరకు హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9.45 కోట్లు అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నారు. పౌరుల సహకారంతో సుమారు 70 శాతం నగదు పట్టుకున్నామని పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 200 కేసులు, 1869 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. నగదు తరలింపు ఘటనల్లో వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయడంలేదని, విచారణ కోసమే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్టు స్పష్టంచేశారు అంజనీ కుమార్.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదుతో పట్టుబడిన వారిలో 19 మందికి శిక్షలు పడ్డాయన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ చెప్పారు. పౌరులు సహకరిస్తే ఎన్నికల్లో ధన ప్రవాహం లేకుండా చూస్తామన్నారు.