Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యాదాద్రి లో వైభవంగా లక్ష్మీ నారసింహుడి కళ్యాణం... కమనీయం

Category : editorial

వేద మంత్రాల సాక్షిగా , మేళ తాళాల తోడుగా , భక్తుల జయజయ ధ్వానాల నడుమ , యాదాద్రి నారసింహునికల్యాణం కమనీయంగా జరిగింది. నింగీ , నేలా పరవశించింది. యాదాద్రిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పరమ పావన చరితుడైన యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని పెళ్ళికొడుకుగా, లక్ష్మీ అమ్మవారు పెళ్లి కూతురుగా దర్శనం ఇచ్చారు. లోక కల్యాణం కోసం నిర్వహించే ఈ కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా ఘనంగా జరిగింది. తలంబ్రాలే తారలై మెరిసిపోతుండగా శ్రీలక్ష్మీనారసింహుని తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

భక్తుల.. స్వామి నామస్మరణతో యాదాద్రి కొండ మారుమోగింది. యాదాద్రి బాలాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు, కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలో రాత్రి శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. బాలాలయంలో జరిగిన కల్యాణ ఉత్సవంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు.

ఉదయం శ్రీవారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంతవాహనంలో బాలాలయంలో విహరించారు. అశేష భక్తజనంతో యాదాద్రికొండ కిక్కిరిసింది. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రాజాసదారామ్, కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆలయ విస్తరణ పనులు అద్భుతంగా నిర్వహిస్తున్న స్థపతులు, ఉప స్థపతులు, శిల్పుల సేవలను లక్ష్మీనరసింహుని భక్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని గవర్నర్ నరసింహన్ అన్నారు. యాదాద్రిలో ఆయనను.. కలిసిన ఆలయ స్థపతులు ఎస్ సుందరరాజన్, డాక్టర్ ఆనందాచార్యుల వేలు, తదితరులను అభినందించారు.