యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయ్యింది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయటం ఏదో ఒక వీడియో పెట్టటం అది క్లిక్ అయితే ఎంతోకొంత సంపాదించుకోవటం. ఈ నేపధ్యంలోనే బ్రిటన్‌కు చెందిన 26 ఏళ్ల మిడిల్టన్ అనే వ్యక్తి యూట్యూబ్ నుండి వందల కోట్లు సంపాదిస్తున్నాడు. ఏంటి నమ్మలేక పోతున్నారా..నమ్మాలి మరి యూట్యూబ్ నుండి కోట్లు సంపాదించి ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఎక్కాడు ఇతగాడు.
టెస్కో సూపర్ మార్కెట్ మాజీ ఉద్యోగి డాన్ మిడిల్టన్ సంచలనం సృష్టించాడు. యూట్యూబ్ సంపాదనలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏకంగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఎక్కాడు. బ్రిటన్‌కు చెందిన 26 ఏళ్ల మిడిల్టన్ తన యూట్యూబ్ చానల్ డాన్ టీడీఎంలో వీడియో గేములు ఆడుతూ అందుకు సంబంధించిన వివరాలు చెబుతుంటాడు.
గేమ్ ఎలా ఆడాలి? వ్యూహాలు తదితర వాటిని వివరిస్తుంటాడు. అతడి చానల్‌కు 1.70 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా రూ.106 కోట్లు (16.5 మిలియన్ డాలర్లు) సంపాదించి యూట్యూబ్ స్టార్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు సంపాదించుకున్నాడు. కాగా, యూట్యూబ్ గణాంకాల ప్రకారం.. జూన్ 1 2016 నుంచి జూన్ 1, 2017 మధ్య మొత్తం పదిమంది యూట్యూబ్ స్టార్లు మొత్తంగా రూ.818 కోట్లు సంపాదించారు.