//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి ప్రేమచిహ్నం-తాజ్ మహల్

Category : editorial

ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి ప్రేమ చిహ్నానికి మతం రంగు!చరిత్రను ఎవరూ మార్చలేరు........... ఇవాళ తాజ్‌మహల్‌కు సంకుచితత్వాన్ని ఆపాదించితే, అది ఒక చోట ఆగదు. కులాలు, మతాల వారిగా, ఎవరి కుళ్ళును వారు కళా సాంస్కృతిక, విజ్ఞాన రంగాల వారసత్వ సంపదపై కుమ్మరిస్తూ పోతే, ఇక మనకంటూ వారసత్వంగా మిగిలేది విధ్వంస సంస్కృతే. ఈ కుసంస్కృతిని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ప్రపంచ ప్రఖ్యాత అద్భుత కళాఖండమైన తాజ్‌మహల్‌ను భారతీయ సంస్కృతికి మచ్చ అంటూ కించపరుచడం దిగ్భ్రాంతికరం. ఏటా లక్షలాదిమంది దేశ విదేశీ యాత్రికులు సందర్శించే తాజ్‌మహల్‌ను ఉత్త రప్రదేశ్ ప్రభుత్వం యాత్రికుల సూచి నుంచి తొలిగించిన అనతికాలంలోనే సంగీత్ సోమ్ ఈ కళాఖండంపై విపరీత వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తున్నది. మతకలహాలను రేపిన కేసులో నిందితుడైన సంగీత్ సోమ్ తాజ్‌మహల్‌పై, చరిత్రపై వెల్లడించిన అభిప్రాయాలు ఇటీవల దేశంలో ప్రచారమవుతున్న అసహన భావజాలానికి దగ్గరగా ఉండటం గమనార్హం.

ఈ చారిత్రక సంపదకు మతం రంగు పులుముతూ, ఒక నియంత నిర్మించిన కట్టడంగా పేర్కొన్నా రు. మొఘల్ చక్రవర్తులను చరిత్ర నుంచి చెరిపివేయాలని కూడా అభిప్రాయపడ్డారు. రాముడు, మహారాణా ప్రతాప్, శివాజీలను చరిత్ర పుస్తకాలలో చేర్చడం ద్వారా చరిత్రను చక్కదిద్దాలని కూడా ఆయన అన్నారు. కానీ పురాణ, చారిత్రక పురుషులను యూపీ పాలకులు కొత్త గా దివిటీ పెట్టి చూపించవలసిన అవసరం ఉన్నదా? రాముడిని భారతీయ సమాజానికి కొత్తగా పరిచయం చేయాలా! రాణాప్రతాప్, శివాజీలకు ఇప్పటికే చరిత్రలో వారి స్థానం వారికి ఉన్న ది. తాజ్‌మహల్ నిర్మించిన షాజహాన్ తండ్రిని జైలులో పెట్టాడని కూడా సోమ్ ఆరోపించారు. కానీ షాజహాన్ స్వయంగా ఖైదు అనుభవించాడు. ఒక జాతీయ స్థాయి రాజకీయపక్షం, అం దులోనూ కేంద్రంలో, యూపీలో అధికారం నెరుపుతున్న పార్టీకి చెందిన శాసన సభ్యుడి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వినరావడం తీవ్ర అభ్యంతరకరం.సంగీత్‌సోమ్ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో బీజేపీ నుంచి కొంత సవరణలు, వివరణలు వినిపిస్తున్నాయి.సోమ్ వెల్లడించినది వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీది కాదని అంటున్నారు.

స్వయంగా సోమ్ కూడా తాజ్ మహల్‌ను వ్యతిరేకించడం లేదు. అదొ క సుందరమైన వారసత్వం. కానీ దానిని నిర్మించి న మొఘల్స్‌ను, వారిని చరిత్రలో చూపించిన తీరును వ్యతిరేకిస్తున్నా అని వివరణ ఇచ్చుకున్నారు. వారసత్వాన్ని గర్వంగా చెప్పుకోకుండా ఏ దేశమూ ముందుకు పోలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించా రు. తాజ్‌మహల్ భారతీయుల చెమట, నెత్తురుతో నిర్మితమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సవరించారు. తాజ్‌మహల్, ఆగ్రా కోటల పథకాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లనున్నట్టు తెలిపారు. సోమ్ వ్యాఖ్యలను ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి ఆమోదించ డం లేదనే సూచనలు వెలువడటం కొంత ఊరట కలిగిస్తున్నది. అయితే ఎన్డీయే అధికారానికి వచ్చిన నాటి నుంచి సాగుతున్న పోకడల నేపథ్యంలో బీజే పీ పెద్దలు మాటలతో సరిపెట్టకూడదు. అసహన సంస్కృతి పెచ్చరిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలె. విదేశీ సందర్శకులకు తాజ్ మహల్ వంటి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించని ప్రతీకలకు బదులు రామాయణ, గీతా ప్రతులను కానుకలుగా ఇస్తున్నామని గతంలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. విదేశీ సందర్శకులకు రామాయణ, మహాభారత ప్రతులు ఇవ్వడం హర్షణీయం. ప్రఖ్యాతిగాంచిన ఈ ఇతిహాసాలు భారతీయులకే కాదు, ప్రపంచ మానవాళికంతటికీ గర్వకారణం. కానీ తాజ్‌మహల్ మన సంస్కృతికి ప్రతిబింబం కాదంటూ తక్కువ చేసి చూడకూడదు.తాజ్‌మహల్ వంటి కళా ఖండాలపై ఇతర సమాజాల ప్రభావం ఉన్నమాట నిజమే. విదేశీ కళల ప్రభావంతో భారతీయ కళారంగం సుసంపన్నమైనది. కానీ ఇంకా పూర్వమే భారతీయ కళలు, విజ్ఞానం చైనా మొదలుకొని పశ్చిమాసియా, మధ్య ఆసియా దాటి గ్రీసు వరకు తమ ప్రభావాన్ని చూపాయి. భారతీయ కళా సంస్కృతుల ప్రభావం తూర్పు ఆసియా దేశాలలో అమితంగా ఉన్నది.

ప్రపంచమంతా గర్వపడే ఈ కళాఖండాలను ఒక దేశానికో, ఒక సంస్కృతికో, ఒక పాలకుడికో అంటగట్టి చూడటం సంకుచితత్వమే. ఇటువంటి వాదనలకు దిగేవారు ఏ సంస్కృతికి ప్రతినిధులు కారు. తాజ్‌మహల్ సుసంపన్నమైన కళా, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇది భారతీయులకే కాదు, అంతర్జాతీయ సమాజానికి అంతటికీ గర్వకారణమైనది. దీనిని నిర్మించిన ఘనత ఒక్క రాజుకే దక్కుతుందా! దానికి రూపమిచ్చి ప్రాణం పోసిన వాస్తు శిల్పులు, చమటోడ్చి నిర్మించిన శ్రమజీవులు లేరా? తాజ్‌మహల్‌ను నిర్మించిన ఘనత భారతీయ సమాజానికి దక్కుతుంది. ఒక్క కళారంగంలోనే కాదు, విజ్ఞానరంగంలోనూ భారత దేశం ఇతరదేశాలకు ఎంత పంచిందో, అంత స్వీకరించింది. సింధులోయ నాగరికత నాటికే ప్రపంచీకరణ పరిపరి విధాల సాగింది. చరిత్రలోని ఏ యుగంలోనూ ఏ సమాజం గిరిగీసుకొని బతుకలేదు, అది ఏనాడూ సాధ్యం కాదు. సింధులోయ నాగరికతను మానవాళి ప్రస్థానంలో భాగంగా చూడాలె తప్ప ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం చేస్తామా! ఇవాళ తాజ్‌మహల్‌కు సంకుచితత్వాన్ని ఆపాదించితే, అది ఒక చోట ఆగదు. కులాలు, మతాల వారిగా, ఎవరి కుళ్ళును వారు కళా సాంస్కృతిక, విజ్ఞాన రంగాల వారసత్వ సంపదపై కుమ్మరిస్తూ పోతే, ఇక మనకంటూ వారసత్వంగా మిగిలేది విధ్వంస సంస్కృతే. ఈ కుసంస్కృతిని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిది.