//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అద్భుత ద్వీపం బాలి వెళ్తే జాలీనే

Category : editorial

అదొక సుందరమైన ప్రదేశం. పచ్చదనం తొణికిసలాడే ప్రదేశం. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే అద్భుతమైన ద్వీపం. ఎటు చూసినా జలకళతో ఉట్టిపడే ప్రాంతం. అక్కడికి వెళ్ళిన మనస్సులను ఊయలలూగించే ముచ్చటైన ప్రదేశం బాలి.

నేలతల్లికి పచ్చని చీర చుట్టినట్టు పరుచుకున్న వరిచేలు, గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతన కట్టడాలు, అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు, నోరురించే రుచులతో ఆహార ప్రియులను కట్టిపడేసే వంటలు, అనేక రకాల జాతులకు చెందిన వానరాలకు ఆలావాలమైన అడవులు....ఇన్ని ప్రత్యేకలతో బాసిల్లుతుంది కాబట్టే బాలి పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హనిమూన్‌ వెళ్లే జంటలకయినా, కుటుంబంతో ఆనందంగా విహారానికైనా, చివరకూ ఒంటరి పక్షులకయినా చక్కటి అనువైన ప్రదేశం బాలి. ఇండోనేషియాకు ప్రధాన ఆదాయ వనరుగా బాసిల్లితున్న బాలి ఒక ద్వీపం. బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్న బాలి గురించి మరిన్ని విశేషాలు మీ కోసం

బాలిలో దాదాపు 20వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిని సందర్శించుకోవాలంటే ఈ వేసవి సెలవులు సరిపోవు. కాబట్టి ముఖ్యంగా చూడాల్సిన ఆలయాల జాబితాను తయారు చేసుకుని దాని ప్రకారం దర్శించుకుంటే బాగుంటుంది. వీటిలో సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద వెలసిన ‘తనాహ లాట్‌’ ఆలయం, సముద్ర జీవుల ప్రదర్శనశాల, అగ్ని చుట్టూ నృత్యం చేసే కళాకారులతో అబేధ్యమైన కొండ మీద వెలసిన మరో ఆలయం ‘ఉలువాటు’. బాలీయులు ఎక్కువగా సందర్శించే మరో ప్రముఖ ఆలయం ‘మాతృ ఆలయం’. ఈ ఆలయాలను తప్పక సందర్శించాలి. ఇక ద్వీపం అంతా పరుచుకున్న పచ్చటి వరిమడులు వీనులవిందుగా ఉంటాయి. ఉబుద్స్‌ తెగలల్లాంగ్‌, తబనాన్స్‌ జతిలువిహ ఈ వరిమడులకు ప్రసిద్ధి గాంచాయి. ఫోటోగ్రాఫి అంటే ఆసక్తి ఉన్న వారు తమ కెమరాలకు పని చెప్పి అద్భుతమైన దృశ్యాలను బంధించవచ్చు.బాలి వెళ్లిన వారు ఎవరైనా తప్పక సందర్శించాల్సింది, ప్రయత్నించి చూడాల్సినవి ఊయలలు.

20మీటర్ల ఎత్తులో గాలిలో ఊగుతూ సముద్రాన్ని, ఆకాశాన్ని, అడవిని చూడటం ఒక వింత అనుభూతి. బాలిలోని ‘ఉబుద్‌’ ప్రాంతం ఈ ఊయలలకు ప్రసిద్ధి. ట్రెక్కింగ్‌, సీతాకోక చిలుకల ఉద్యావనవనానికి సమీపంలో ఉన్న ఉబుద్‌లో నాలుగు చోట్ల నాలుగు వేర్వేరు ఎత్తుల్లో ఉన్న ఈ ఊయలలను సాహిసికులు సందర్శించకుండ ఉండలేరు.విభిన్న జాతులకు చెందిన కోతులకు ప్రసిద్ది ఈ సంరక్షణా కేంద్రం. ‘పెడంటిగల్‌’లో ఉన్న ఈ అడవిలో అడవి అందాలను ఆస్వాదిస్తూ వెళ్తు కోతులను చూడొచ్చు, స్వయంగా వాటికి మనమే ఆహారాన్ని పెట్టవచ్చు.ఇక భోజన ప్రియులకు చక్కటి విహార స్థలం బాలి. ఇక్కడ వడ్డించే ఆహారంలో ప్రధానంగా ఉండేవి కొబ్బరి, మసాలాలతో కూడిన మాంసం, సముద్ర ఆహారం. ఇక్కడి ప్రత్యేక వంటకాలు సతాయ్‌ (వేయించిన మాంసం), బాబీ గులింగ్‌ (ఉప్పు చల్లి వేయించిన పంది మాంసం), నాసీ గోరెంజ్‌ (సుగంధ ద్రవ్యాలు, మాంసం, కొబ్బరి, బియ్యంతో కలిపీ వండే బాలీ ప్రత్యేక సంప్రాదాయ వంటకం) నోరూరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అలసిన మనసులకు ఆటవిడుపు కావాలన్నా, కొత్తగా పెళ్ళైన జంట సంతోషంగా గడపాలన్నా బాలి వెళ్తే జాలీ గా గడిపెయ్యొచ్చు.