ఇండియా మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది మిథాలీ. ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 34 పరుగుల దగ్గర ఆమె ఈ రికార్డు అందుకుంది. ఇన్నాళ్లూ 5992 రన్స్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది.
మ్యాచ్‌కు ముందు 5959 పరుగులతో రెండో స్థానంలో ఉన్న మిథాలీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ఎడ్వర్డ్స్ కంటే తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన రికార్డు కూడా మిథాలీ సొంతమైంది. 16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిటే ఉంది.
ఉమెన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌గా మిథాలీకి పేరుంది. దానిని నిలబెడుతూ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి 18 ఏళ్లవుతున్నా ఇంకా రికార్డులను బద్ధలు కొడుతూనే ఉంది. ఈ మధ్యే వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గానూ మిథాలీ నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు ఆమె సగటు 40పైనే ఉంది.
సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్లే 40కి పైగా సగటుతో పరుగులు చేయడం విశేషం. ఇక మధ్యలో ఐదేళ్లు (2008-12) మినహాయిస్తే 2004 నుంచి టీమ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నది మిథాలీ. 105 వన్డేల్లో మిథాలీ కెప్టెన్‌గా ఉన్నది. త్వరలోనే కెప్టెన్‌గా ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 117 వన్డేల రికార్డును కూడా మిథాలీ అధిగమించనుంది. మిథాలీ కెప్టెన్‌గా ఉన్నపుడు ఇండియా 61 శాతం మ్యాచ్‌లు గెలవగా, ప్లేయర్‌గా కేవలం 53 శాతమే గెలిచింది.