ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కు టోకరా వేసింది బెంగళూరు మహిళ. కొన్న వస్తువులను రిటర్న్ చేస్తూ లక్షలు సంపాదించింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన దీపాన్విత ఘోష్ బెంగుళూరులో నివాసం ఉంటోంది. డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో… ఆన్ లైన్ సంస్థ అమెజాన్ పై దృష్టిపెట్టింది. ఆన్ లైన్ లో వస్తువులు కొనడం.. పార్సిల్ లో వచ్చిన వాటి స్థానంలో నకిలీ సరుకులు పెట్టి అవి బాగోలేవని చెప్పి మళ్లీ వెనక్కు పంపించడం. ఆ వస్తువులను బయట మార్కెట్ లో అమ్ముకోవడం చేసేది. ఇలా 104 సార్లు వస్తువులు కొన్నది… రిటర్న్ చేసింది. అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులే. వాటిని బహిరంగ మార్కెట్ లో అమ్మకునేది. ఇలా రూ.69.91 లక్షలు సంపాదించింది. ఆర్డర్ ఇచ్చిన ప్రతీసారి తన అడ్రస్ మార్చేది. ఎలాగో అలా తన అకౌంట్ లో మాత్రం డబ్బులు వేయించుకునేది. ఈ విధంగా ఏడాది నుంచి ఆ మహిళ అమెజాన్ ను మోసం చేస్తూ వస్తుంది. ఇలా ప్రతి సారి రిటర్న్ అవుతున్న ఉత్పత్తులపై బెంగళూరులోని అమెజాన్ సెల్లర్ సర్వీస్ ప్రతినిధులు విచారణ చేపట్టారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దీపాన్వితా ఘోష్ అనే మహిళ ఇలా ఐటమ్ లన్నీ ఆర్డర్ చేస్తోందని తేలింది. అలా రూ.70 లక్షలు సంపాదించిందని గుర్తించారు. దీంతో అమెజాన్ ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెను అరెస్ట్ చేశారు.