సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ.. రోడ్లపై నిర్లక్ష్యంగా నడుస్తూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా.. అలాంటి వారిలో మార్పు రావడం లేదు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళా సెల్ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తూ ప్రమాదానికి గురైంది. 67 ఏళ్ల ఓ మహిళ సెల్ఫోన్లో ఏదో టైప్ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తోంది. ఆ దారిలో తెరిచి ఉన్న ఓ బేస్మెంట్ డోర్లను గమనించలేకపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా అందులో పడిపోయింది. 6 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో పడ్డ ఆమెను అటువైపుగా వెళ్తున్న పలువురు చూసి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పైప్లైన్లకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆ బేస్మెంట్ డోర్లను తెరిచినట్లు అధికారులు చెప్పారు. అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.