దేశీయ ప్రముఖ ఐటీ సంస్థ విప్రో త్వరలో షేర్ల బైబ్యాక్ చేపట్టనుంది. రూ. 11కోట్లతో షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు వాటాదారులు కూడా అంగీకరించినట్లు విప్రో వెల్లడించింది. కంపెనీ వాటాదారుల నుంచి 343.75 మిలియన్ షేర్లను బైబ్యాక్ చేపట్టనున్నట్లు విప్రో గత నెల్లోనే ప్రకటించింది.
ఒక్కో షేరును రూ. 320తో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు గానూ కంపెనీ రూ. 11వేల కోట్లను వాటాదారులకు చెల్లించనుంది. అయితే, దీనిపై మదుపర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు పోస్టల్ బ్యాలెట్, ఈ-ఓటింగ్ పెట్టినట్లు సంస్థ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఆగస్టు 28న పూర్తయిన ఈ అభిప్రాయసేకరణలో బైబ్యాక్‌కు అనుకూలంగా 99.68శాతం ఓట్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
వాటాదారులకు ఇచ్చిన షేర్లను తిరిగి వారి నుంచే కంపెనీ కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు. దీని వల్ల షేరు వారీ ఆర్జన పెరుగుతుంది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలు ఈ బైబ్యాక్‌ను తీసుకొచ్చాయి. టీసీఎస్ రూ.16వేల కోట్లతో చేపట్టగా.. ఇన్ఫోసిస్ రూ.13వేల కోట్ల విలువ గల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.