ప్రఖ్యాత ఎన్సైక్లోపిడియా వెబ్సైట్ వికీపీడియా మరొక వైబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. 'వికీట్రిబ్యూన్' పేరుతో ప్రారంభించనున్న ఈ వెబ్సైట్లో ఏ ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలిపేలా ఎప్పటికప్పుడు వార్తలను పొందుపర్చనున్నారు. అసత్య వార్తలపై పోరాటం చేసేందుకే 'వికీట్రిబ్యూన్'ను ప్రారంభిస్తున్నామని వికీపీడియా సహ వ్యవస్థాపకులు జిమ్మీ వేల్స్ తెలిపారు. ఇంగ్లాండ్, అమెరికా రాజకీయాలతో సహా అన్ని అంశాలు ఈ వెబ్సైట్లో వుంటాయన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన వార్తలు కూడా ఈ సైట్లో వుంటాయి. వికీట్రిబ్యూన్ను 'ప్రజలు నుంచి వార్తలు, ప్రజల కోసం వార్తలు'గా వేల్స్ అభివర్ణించారు. 'ప్రొఫెషనల్ జర్నలిస్టులు, స్వచ్ఛంద సేవకుల ద్వారా వార్తలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. వికీపీడియా మాదిరిగానే ఈ వెబ్సైట్లోనూ ఎలాంటి ప్రకటనలు ప్రచురించం. పూర్తిగా విరాళాలతోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తాం' అని వేల్స్ తెలిపారు. ఇంగ్లాండ్ సాధారణ ఎన్నికలు ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో సైట్‌ను ప్రారంభిస్తున్నామని, అమెరికాలోనూ ప్రత్యేక అంశాన్ని తీసుకుంటామని అన్నారు.