ప్రధాని మోడీ అమెరికా పర్యటిస్తున్న సమయంలోనే హిజ్బుల్ నేత సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా వైట్‌హౌస్ ప్రకటించింది. దీంతో పెద్దగా ప్రాచుర్యం పొందని ఈ సలావుద్దీన్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాశ్మీర్ వివాదంపై రాజకీయ పరిష్కారం కోసం చర్చలు జరగనీయకుండా అడ్డుపడుతున్నాడని, కాశ్మీర్‌ను భారత సైనికుల స్మశాన వాటికగా మారుస్తానని గతంలో బెదిరించాడని సలావుద్దీన్‌పై చేసిన ప్రకటనలో అమెరికా పేర్కొంది.
అయితే సలావుద్దీన్ 1987లో జమ్మూకాశ్మీర్‌లోని అమిర్కదల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం. 1946లో జన్మించిన సలావుద్దీన్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ షా. ఉగ్రవాద సంస్థలో చేరిన తరువాత తన పేరును సలావుద్దీన్గా మార్చుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్ ముజాహుద్దీన్, లష్కరే తొయిబా వంటి సంస్థలకు సహకారమందిస్తున్న యునైటెడ్ జిహాద్ కౌన్సిల్(యుజిసి) అధ్యక్షునిగా ఉన్నారు.
కాశ్మీర్‌కు స్వాతంత్య్రం లేదా పాకిస్తాన్లో కలిపేయాలనే డిమాండ్లు, నినాదాలతో లోయలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో 17 మంది మరణించారు. మరింతమందిని ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేస్తామని ఆ సందర్భంగా హెచ్చరించారు. ముజాహుద్దీన్ చేస్తున్న పోరాటం పాకిస్తాన్‌కు పరోక్షంగా సహకరిస్తుందని ఆయన చేసిన బహిరంగ ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయద్తో తీసుకున్న ఫొటోలు గతేడాది వైరల్ అయిన సంగతి తెలిసిందే. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కాశ్మీర్లో వారం రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని వీడియో క్లిప్ ద్వారా సందేశాలు ఇచ్చారు. దీంతో సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, అమెరికాలను భారత్ కోరింది.
కొన్ని దేశాలు ఆ డిమాండ్‌ను వ్యతిరేకించినా చాలా దేశాలు భారత్‌కు మద్దతిచ్చాయి. సెప్టెంబర్ 11 దాడి అనంతరం అమెరికాలో ఏర్పాటైన బ్యూరో ఆఫ్ కౌంటర్ టెర్రరిజమ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న సంస్థలు, వ్యక్తులను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. ఆ సంస్థల తరపున పోరాడే వ్యక్తులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది.