//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్లాస్టిక్ పై నిషేధం ఏమయింది?

Category : editorial

ప్లాస్టిక్ పై నిషేధం ఏమయింది?

ప్లాస్టిక్‌పై నియంత్రణ కరవు

పొంచిఉన్న పర్యావరణ ముప్పు

పారవేసే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి రెండు బుట్టల్లో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలనే పురపాలక శాఖ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ఇందుకోసం ప్రభుత్వమే ఇంటింటికీ రెండు చెత్తబుట్టలు పంపిణీ చేపట్టాలని భావించినా సంకల్పం నెరవేరలేదు.తడిపొడి చెత్త ఏదైనా ప్లాస్టిక్‌ కవర్లద్వారానే డంపుయార్డులకు చేరుతోంది. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా పురపాలికల్లో అమలుకు నోచుకోని పరిస్థితిపై ప్రత్యేక కథనం...

విఫణిలో ఏ సరకులు కొనుగోలు చేసినా వినియోగదారులు ప్లాస్టిక్‌ సంచులపైనే ఆధారపడుతున్నారు. వ్యాపారులు సైతం సరకుల్ని ప్యాక్‌ చేసేందుకు ప్లాస్టిక్‌నే నమ్ముకుంటున్నారు. పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్‌ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. పాలిథిన్‌ వాడకంతో ఎన్నో అనర్థాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధించింది. అయినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పూర్తిస్థాయిలో నిషేధం అమలుకు నోచుకోవడంలేదు. ప్లాస్టిక్‌ వాడుతున్నారు కాబట్టే విక్రయిస్తున్నామని వ్యాపారులు.. వారు విక్రయిస్తున్నారనే వాడుతున్నామని వినియోగదారులు తప్పును ఎదుటివారిపై రుద్దుతున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల మెట్‌పల్లి పురపాలికలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ పేరిట కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్లాస్టిక్‌ నిషేధానికీ ప్రాధాన్యం ఉంది. కానీ ఏ పురపాలికలోనూ పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం చేపట్టడంలేదు.

తనిఖీలతోనే సరి...

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం ఉన్నా అధికారులు ఈ అంశంపై పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పట్టణాల్లో అడపా దడపా తనిఖీలు చేసి హడావుడి చేస్తున్నారు. కొన్నిసార్లు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. ప్లాస్టిక్‌ విక్రయదారులకు స్థానిక సిబ్బంది ముందే దాడుల సమాచారం ఇవ్వడంతో సరకులు దాచిపెడుతూ వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు. దాడులు సద్దుమణిగాక మళ్లీ ప్లాస్టిక్‌ వ్యాపారులు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించడం ఆనవాయితీగా మారింది. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై పురపాలికలు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నిషేధం నీరుగారుతోంది. ప్లాస్టిక్‌ సంచుల వాడకం వల్ల సమాజానికి జరిగే నష్టంపై అధికారులు సదస్సుల ద్వారా అవగాహన కల్పించాల్సి ఉన్నా తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్‌ బదులుగా జనపనార, కాగితపు ఉత్పత్తుల వాడకం పెరగాలి. ఈ తరహా యూనిట్లను అధికారులు ప్రోత్సహించాలి.

అవగాహనతోనే సాధ్యం..

నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసుల తయారీ యూనిట్లను మూసి వేయించాలి. ప్రజలు వీటిని వినియోగించడం పూర్తిగా తగ్గిపోతుంది.వ్యాపార కేంద్రాల్లో ప్లాస్టిక్‌ సంచులు అందుబాటులో లేకుండా కఠిన నిబంధనలు అమలు పరచాలి. వినియోగదారులు బయటకు వెళ్లే సమయంలోనే కాగితం, నార సంచులు తీసుకెళ్లేలా చైతన్య తీసుకురావాలి.నిషేధంలో భాగస్వామ్యులయ్యే సామాజిక వేత్తలను, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ప్రమాదకర పాలిథిన్‌ వినియోగం నియంత్రించడం సులభం.నల్లటి పాలిథిన్‌ రీసైక్లింగ్‌కు పనికిరాదు. ఇవి చెత్తలో కలిసిపోవడం వల్ల భూసారం దెబ్బతింటుంది. ఇలాంటి సంచుల విక్రయదారులపై కఠినమైన ఆంక్షలు విధించాలి.ఆయా పురపాలికలు తమ పరిధిలోని వార్డుల్లో అవగాహనా సదస్సులు ప్రతినెలా నిర్వహంచడం ద్వారా స్థానికుల్లో మార్పు రావడం తథ్యం.అమలుకు నోచుకోని నిబంధన.. పాలిథిన్‌ కవర్లతో కలుగుతున్న నష్టాలపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు 2016 రూపొందించింది. వీటిని అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది