బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ప్రధాన పాత్రదారుడిగా భావిస్తున్న ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్షమాపణ చెప్పాడు. తాను చేసిన పనికి చింతిస్తున్నానని అన్నాడు. వివరాల్లోకి వెళితే 31 ఏళ్ళ వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ప్రధాన సూత్రదారి అతడేనని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నారు. కెప్టెన్ స్మిత్ సహా వార్నర్ , బ్యాన్క్రఫ్ట్ పై ఏడాది నిషేధం విధించారు.
దీనిపై వార్నర్ మాట్లాడుతూ “ఆ ఉదంతంలో నేను వహించిన పాత్రకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. అందుకు క్షమించాలని వేడుకొంటున్నా. మా తప్పిదంతో క్రికెట్‌కు జరిగిన చేటు, అభిమానులకు కలిగిన క్షోభను అర్థం చేసుకోగలను. బాల్యం నుంచి క్రికెట్ అంటే పడిచచ్చే నేను..నా ప్రవర్తనతో దానికి చెడ్డపేరు తెచ్చా’ అని అన్నాడు. తన భవిష్యత్‌ను నిర్ణయించుకొనేందుకు కొంత సమయం అవసరమని 31 ఏళ్ల వార్నర్.. త్వరలోనే మీకొక విషయం వెల్లడిస్తాని చెప్పాడు. అయితే అతడు క్రికెట్ నుంచి వైదొలుగుతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.