భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో బిసిసిఐ కొత్త కోచ్ వేటలో పడింది. దీంతో కోచ్ పదవి కోసం బిసిసిఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ జూలై 9 వరకు గడువును పొడిగించింది. ఇప్పటికే భారత మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సెహ్వాగ్, దొడ్డా గణేశ్, లాల్ చంద్ రాజ్ పుత్ లతోపాటు విదేశీ మాజీ ఆటగాళ్లలో రిచర్డ్ పైబస్, టామ్ మూడీలు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే తాజాగా వెస్టిండీస్ మాజీ కోచ్ పిల్ సిమన్స్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, జింబాంబ్వే జట్లకు కోచ్ గా వ్యవహరించిన అనుభవం కూడా సిమన్స్ కు ఉంది. ఇక కోచ్ గా సిమన్స్ కు మంచి రికార్డు ఉంది. ఐర్లాండ్ జట్టుకు సిమన్స్ కోచ్ గా ఎనిమిదేళ్లు సేవలందించాడు. 2011, 2015 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ సంచలన విజయాల్లో సిమన్స్ పాత్ర కీలకం. అలాగే విండీస్ టీ20 ప్రపంచకప్ విజయంలో కూడా సిమన్స్ కోచ్ గా కీలకంగా వ్యవహరించాడు.