బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లకు పెంచిన జీతాలపై విరాట్ కోహ్లీ, కోచ్ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనితో మళ్ళీ జీతాలపై చర్చించనుది బీసీసీఐ. జీతాల్ని మరింతగా పెంచాలన్న విరాట్ కోహ్లి డిమాండ్ పట్ల బోర్డు పాలక కమిటీ సానుకూలంగా స్పందించింది. బుధవారం ఐపీఎల్ ఆరంభోత్సవం సందర్భంగా పాలక కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్‌తో, కోహ్లి సమావేశమయ్యాడు. అనంతరం రాయ్ మాట్లాడుతూ జీతాల పెంపుపై మరో సమావేశమవుతామని, ఆటగాళ్లకు సంబంధించిన ఏ అంశం గురించైనా అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ విషయంలో ఎంతమాత్రం ఉదాసీనత ఉండదని, కాకపోతే మేం ఆటగాళ్లతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాం అని, దీనిలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. విరాట్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లను కలిశాం. సమావేశం సంతృప్తికరంగా సాగింది. జీతాల విషయమై అనిల్ కుంబ్లే ప్రెజెంటేషన్ కోరాం. దాని గురించి విరాట్ కూడా మాట్లాడాడు. ఇప్పటికే ఆటగాళ్ల జీతాల్ని గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు చేశాం. ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తాం. ఆటగాళ్ల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుంటాం’’ అని రాయ్ అన్నాడు.