తీవ్రవాదులు ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తున్నారని దాన్ని అంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటలీ లోని టోర్మినాలో జరిగిన జి7 సదస్సు నేతలు ప్రతిన చేశారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో హానికరమైన తీవ్రవాద సమాచారాన్ని తొలగించాలని ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే సాంకేతిక సంస్థలకు స్ఫష్టం చేశారు.
తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని జి7 పారిశ్రామిక దేశాల నేతలు స్పష్టం చేశారు. మాంచెస్టర్ దాడి నేపథ్యంలో జరిగిన జి7 సదస్సులో అంతర్జాతీయ సమాజానికి తీవ్రవాదం విసురుతున్న సవాళ్ళను ఐక్యంగా ఎదుర్కొనాలని జి7నేతలు నిర్ణయించారు.
హింసతో కూడిన తీవ్రవాదంపై పోరు సాగించడమే ప్రస్తుతం జి 7 దేశాల ప్రధాన ప్రాధాన్యతగా వుందని సదస్సు ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాద చర్యలను నివారించేందుకు అవిశ్రాంతంగా కృషి చేయడం, తీవ్రవాదానికి పాల్పడిన కుట్రదారులను, మద్దతుదారులను విచారించడం ద్వారా ఈ పోరాటాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని పిలుపిచ్చారు.
ఐసిస్‌లో చేరేందుకు సిరియా, ఇరాక్‌లకు ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇందుకు గానూ దేశాల మధ్య ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, సాక్ష్యాధారాలను పంచుకోవడం బాగా మెరుగుపడాలని, పోలీసు, న్యాయ విచారణా క్రమాలు కూడా పటిష్టపడాలని బ్రిటన్ కోరింది. తీవ్రవాదులకు అందుతున్న నిధులు, వనరుల మూలాలను కనుగొని వాటిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలు నిర్ణయించారు.
ఇందుకుగానూ ప్రయాణికుల పరిశీలనా సమయంలో పాసింజర్ నేమ్ రికార్డ్ (పిఎన్ఆర్), అడ్వాన్స్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ (ఎపిఐ)ల వినియోగాన్ని మరింతగా పెంచాలని డిక్లరేషన్ పేర్కొంది.సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం, అవకాశాలు కొరవడడం వంటివి కూడా తీవ్రవాదం పెచ్చరిల్లడానికి దోహదపడుతున్నాయని, హింసకు దారి తీస్తున్నాయని డిక్లరేషన్ పేర్కొంది.