భారత్-చైనా సరిహద్దు సమస్యతో తలెత్తిన వివాదంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం శ్రుతిమించుతున్నది. 1962 నాటి ఇండియా ఇప్పటి ఇండియా ఒక్కటి కాదన్న రక్షణమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై చైనా తలబిరుసుతో స్పందించింది. మేమూ అంతేనని తెగేసి చెప్పింది. నాటి చైనా నేటి చైనా ఒకటి కాదని మాటకు మాట వేసింది.
సిక్కిం సెక్టార్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం ద్వారా భారత్ మాట తప్పిందని మండిపడింది. ఇది వెన్నుపోటు తప్ప మరొకటి కాదని ఆరోపించింది. భారత్ వెనుకకు తగ్గితేనే శాంతి నెలకొంటుందని డిమాండ్ చేసింది. మరోవంక ముందు జాగ్రత్త చర్యగా భారత్ సరిహద్దుల్లో సేనలను మోహరింప చేస్తున్నది.
ఇలా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో జర్మనీలో ఈ వారాంతంలో జరిగే జీ-20 సభలో భారత్, చైనా అగ్రనేతలు భేటీ కాబోతున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ జర్మనీలోని హాంబర్గ్ నగరానికి వెళ్తారు. ఈ సందర్భంగా విడిగా జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో ఇద్దరూ కలుసుకుంటారు.
పరిస్థితి అదుపు తప్పితే యుద్ధమేనని చైనా మీడియాతో పాటు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాను మెప్పించేందుకే సిక్కింలో భారత్ రచ్చ చేస్తున్నదని చైనా పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. భారత్, చైనా, భూటాన్లోని సరిహద్దు ప్రాంతమైన డోకా-లాలో గత నెల రోజులుగా ప్రతిష్ఠంభన నెలకొంది.
దీనికి తోడు భారత్ అక్కడ భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరించింది. మరోవంక దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవి సమీపంలోకి అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ స్టెథెమ్ రావడంతో చైనా అప్రమత్తమైంది. సముద్ర, గగనతల గస్తీని ముమ్మరం చేసింది.