Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొండేపల్లిలో టెన్షన్‌ టెన్షన్‌ ...పలువురు ఎంమ్మెల్యే లకు గాయాలు ..

Category : state politics

వేలిపై ఇంకు చుక్క పడాల్సిన చోట.. రక్తం చిందింది.. పచ్చని పల్లెల్లో రక్తం పారింది. కేవలం ఎన్నికల రోజే కాదు. ఎన్నికలు ముగిసిన మరుచటి రోజు చాలా చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది. అర్థరాత్రి దాక చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు భయపెట్టాయి. రాళ్లదాడులు, కర్రదాడులు, చొక్కాలు చింపేయడాలు.. ఇలా ఎన్నో సంఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టీడీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై, వారి వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి ఇప్పటికీ నివురుకప్పిన నిప్పులా మారింది. దాదాపు ఐదారు జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది..

ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. పోలింగ్ బూత్‌లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త భాస్కర్‌ రెడ్డి కుటుంబాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తాడిపత్రి సమీపంలోని వీరాపురం ఉద్రిక్తంగా మారింది. దీంతో తాడిపత్రి మండలంలో పోలీసులు భారీగా మోహరించారు.చిత్తూరు జిల్లాలోని టి.సదుంలో వైసీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన రాళ్లదాడిలో రామాపురానికి చెందిన వెంకట్రామిరెడ్డి మృతి చెందాడు. అంత్యక్రియలకు మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కర్నూలు జిల్లాలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఆళ్లగడ్డలో టెన్షన్‌ టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా.. బలగాలను మోహరించారు. పట్టణంలో పహారా పెంచారు. గంగుల కుటుంబం కావాలనే రెచ్చగొడుతోందని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి.. పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలింగ్ సమయంలో నేతల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి.. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి సొంతూర్లో.. బూత్ ఏజెంట్లుగా ఎలా కూర్చుంటారంటూ టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కొందరికి గాయాలయ్యాయి. భయంతో మార్కాపురం పారిపోయిన కొందరు బాధితులు.. టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సాయంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కొండేపల్లిలో పికెట్ ఏర్పాటుచేశారు. ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడగా ఘర్షణలు కనిపిస్తూనే ఉన్నాయి.