దేశవ్యాప్తంగా అందరూ తినే వాళ్ళు అయితే, ఆహార ఉత్పత్తి చేసే వాళ్ళు ఎవరు.. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తే దేశానికి అన్నం పెట్టేది ఎవరు. అందుకే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావాలి అంటూ తమిళనాడుకు చెందిన ఓ సంస్థ రైతన్నలకు ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది.
దేశానికి వెన్నెముక రైతన్న. అటువంటి రైతన్నలు ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బతకడం కష్టమంటూ చాలా రాష్ట్రాల్లో అన్నదాతలు వలస పోయి కూలీనాలీ పని చేసుకుంటున్నారు. దీంతో తమ పిల్లల్ని సైతం ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు కానీ వ్యవసాయం చేయడానికి ఏ ఒక్కరు ప్రోత్సాహం అందించడం లేదు. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. భవిష్యత్తులో రైతు వారి వ్యవస్థ దెబ్బతిననుంది.
ఇక కొందరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ సృజనాత్మకతను జోడించి కొత్త సాగు విధానాలు కనిపెట్టి అధిక దిగుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరు కు చెందిన ఇక్కడ సంస్థ సేంద్రియ పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల తోటి కొనసాగుతున్న సంస్థ. సేంద్రియ పంటల సాగు చేస్తున్న ఈ సంస్థ రైతన్నల కొరతతో ఇబ్బంది పడుతుంది. అందుకే వాంటెడ్ ఫార్మర్స్ అంటూ ఏకంగా రైతన్నల ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు జీతం ఇస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజసిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే రైతుల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయం చేయగలిగినవారికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది మన దేశానికి రైతన్నలు కావలెను అని.