అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో, H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2017 ఆర్థిక సంవత్సరంలో H1B వీసాకోసం 2.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2018 సంవత్సరానికి ఆ సంఖ్య 1.99 లక్షలకు పడిపోయింది. అంటే 16% వరకు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. H1B కింద ఉద్యోగం చేసే వారి కనీస వేతనం 1.30 లక్షల డాలర్లు ఉండాలని ట్రంప్ బిల్లు ప్రవేశపెట్టడం, అమెరికన్లకే ప్రాధాన్యం వంటి ప్రతిపాదనలు చేయటంతో దరఖాస్తుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 85 వేల H1B వీసాలను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటిలో 20 వేలు అక్కడ మాస్టర్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు, మిగతావి వివిధ దేశాలకు చెందిన నైపుణ్యమంతులకు కేటాయిస్తారు. ప్రస్తుతానికి ఈ వీసాలను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) లాటరీ విధానం ద్వారా ఇస్తుంది.