విలాసవంతమైన కార్ల తయారీ దిగ్గజ సంస్థ వోల్వో ఇప్పుడు కార్ల తయారీని ఇండియాలో ప్రారంభించనుంది. ఇప్పటికే బస్సులు, ట్రక్కులను ఇక్కడ తయారుచేస్తున్న ఆ సంస్థ.. ఇక కార్లనూ ఇక్కడే తయారు చేయాలని నిర్ణయించింది. వోల్వో గ్రూప్ ఇండియాతో కలిసి మేడిన్ ఇండియా కార్లకు రూపకల్పన చేయనున్నది. ఈ ఏడాది చివరి లోపు మేడిన్ ఇండియా వోల్వో కార్లను అమ్ముతామని వోల్వో కార్స్ ప్రెసిడెంట్ హకన్ శామ్యూల్సన్ చెప్పారు. కార్లను ఇక్కడే తయారు చేయడం వల్ల వచ్చే కొన్నేళ్లలోనే ప్రీమియం కార్ల సెగ్మెంట్లో తమ మార్కెట్ షేర్‌ను గణనీయంగా పెంచుకోవాలని వోల్వో భావిస్తున్నది. బెంగళూరు శివారు ప్రాంతమైన హోస్కెటెలో వోల్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. మొదటగా ఎక్స్‌సీ90 ఎస్‌యూవీని తయారు కానుంది. భవిష్యత్తులో అన్ని కార్లను తయారుచేయాలని వోల్వో నిర్ణయించింది.