అమరావతి నగరానికి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్ అందించే కృషిలో భాగస్వామిగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రముఖ ఆన్లైన్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్ కంపెనీ ‘ఓలా’కు సూచించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఓలా గ్రూపుతో ఏపీటీడీసీ, ఏపీ టూరిజం డిపార్టుమెంట్ అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి.
రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధికి ఈ ఎంవోయూలు కీలక భూమిక పోషించగలవన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యక్తంచేశారు. పర్యాటకులు రావాలంటే సురక్షితమైన రవాణ వ్యవస్థ, సమర్ధులైన టూరింగ్, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల అవసరం ఎంతో వుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఇండియా లార్జెస్ట్ క్యాబ్ ఆపరేటర్‌గా ఉన్న ‘ఓలా’ ఏపీలో ఇప్పటికే 6 నగరాలలో 6 వేల వాహనాలను నడుపుతుండటం విశేషమని, రానున్న కొద్దికాలంలో 3 మెగాసిటీలు, 13 కార్పొరేషన్ సిటీలలో ఈ సంస్థ నెట్వర్క్ పెంచుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చగలమన్న నమ్మకాన్ని అందించడం ఎంతో ముఖ్యమని, దీనికోసం సిబ్బందికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, నైతిక ప్రవర్తన అవసరమని చెప్పారు.
ఏపీలో పర్యాటకం అభివృద్ధికి టూరిస్టు ఆపరేటర్లు, క్యాబ్ ఆపరేటర్లు చేసే మార్కెటింగ్ కూడా కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. ప్రజారాజధానిలో సైకిలింగ్, ఎలక్ట్రికల్ ట్రాక్‌లతో పాటు సాధారణ మార్గాలు కూడా వుంటాయని, అన్ని మార్గాలకు అవసరమైన అధునాతన వాహన వ్యవస్థతో ముందుకురావాలని ముఖ్యమంత్రి ‘ఓలా’ క్యాబ్స్ నిర్వహించే ‘ఏఎన్ఐ టెక్నాలజీస్’ బృందానికి వివరించారు.
ప్రస్తుతం ఏపీలో 6 వేలుగా వున్న ఓలా వాహనాలు వచ్చే ఏడాదికి 12 వేలకు, రెండేళ్లలో 16వేలకు, ఐదేళ్లలోగా 25 వేలకు పెంచుతామని ఏఎన్ఐ యాజమాన్యం ముఖ్యమంత్రికి వివరించింది. దీనివల్ల 20 వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. మరో ఐదారు నగరాలకు విస్తరించడం ద్వారా ఏపీలో మొత్తం 12 నగరాలలో తాము అందుబాటులో వుంటామని తెలిపారు.