అవును.. రెండు దిగ్గజాలు కలిశాయ్. బ్రిటిష్ టెలికాం సంస్థ వొడాఫోన్‌కు చెందిన వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూప్ నడుపుతున్న ఐడియా సెల్యులార్‌లు విలీనం కాబోతున్నాయి. విలీన సంస్థ ఎంటర్ప్రైజ్ విలువ రూ.1,55,000 కోట్లుగా అంచనా ఉంది.ఆ మేరకు ఆయా కంపెనీల కార్యకలాపాలను కలుపుతున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. దీంతో అటు వినియోగదారులు, ఇటు ఆదాయం విషయంలో అతి పెద్ద మార్కెట్ వాటాతో కొత్త సంస్థ అగ్రస్థానంలో నిలవనుంది. విలీన సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. ఈ కొత్త సంస్థకు కుమార మంగళం బిర్లా ఛైర్మన్‌గా ఉంటారు. ఇక వొడాఫోన్ సీఈఓ విటోరియో కోలావ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా వ్యవహరిస్తారు. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరుగుతుంది. వొడాఫోన్‌కు ఐడియాలో కొత్త షేర్లను జారీ చేస్తారు. దీంతో వొడాఫోన్ ఇండియా కనుమరుగవుతుంది. కాగా ఈ విలీన ఒప్పందం నుంచి ఇండస్‌టవర్స్‌లో వొడాఫోన్‌కున్న 42 శాతం వాటాను మినహాయించారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి 4.9 శాతం వాటా(రూ.3874 కోట్ల నగదుతో)ను బదిలీ చేసిన అనంతరం కొత్త కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉంటుంది. ఐడియాకు 26 శాతం వాటా ఉంటుంది. మిగతా ప్రజల వద్ద ఉంటుంది. (4.9 శాతం వొడాఫోన్ వాటా కొనుగోలుకు నిధులు ప్రమోటర్ల నుంచి వస్తాయి తప్ప.. ఐడియా నుంచి కాదని బిర్లా స్పష్టం చేశారు).ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్, ఐడియా మనీ; వొడాఫోన్‌కు చెందిన ఎంపెసా సేవలు కూడా విలీన సంస్థల కిందికే వస్తాయి.