ఓవైపు ప్రతిష్టాత్మక 1000వ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు భారత జట్టు తప్పులను వెతికే పనిలో పడింది. అతిథ్య ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జీర్ణించుకోలేకపోతున్నాడు.
కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న జట్టు బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే ఓటమి పాలైందని కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ అద్బుతంగా ఆటను తమవైపునకు లాగేసుకుందని కోహ్లి ప్రశంసించాడు.
‘షాట్ల ఎంపికే మా కొంప ముంచింది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమికి కారణం. జట్టు ఓడినా.. సానుకూల అంశాలతో రెండో టెస్టుకు సిద్ధమవుతాం. భారత తొలి ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్ ప్లేయర్ల ఆటతీరు అమోఘం. ఇంగ్లండ్‌లో మేం గొప్పగానే ఆటను ఆరంభించాం. కానీ చివరికి నిరాశే మిగిలింది.
ప్రతిరోజు ఆటను ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూసిన ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకు మా జట్టు దాదాపు చేరువగా రావడం సానుకూలాంశం. దాచిపెట్టాల్సిన విషయాలేం లేవు. బౌలర్లు రాణించినా, బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ’ తొలి టెస్ట్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి లోనయ్యాడు.