//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో విరాట్‌ కోహ్లీ

Category : sports

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌ మూడో స్థానానికి పడిపోయాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై 81, బంగ్లాదేశ్‌పై 76 పరుగులు సాధించిన కోహ్లీ రెండు పాయింట్లు మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), డివిలియర్స్‌(దక్షిణాఫ్రికా), జాయ్‌ రూట్‌(ఇంగ్లాండ్‌) కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌) ఉన్నారు. 

టాప్‌-10 జాబితాలో భారత్‌కు చెందిన శిఖర్‌ధావన్‌ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ధావన్‌ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ధోనీ 14వ స్థానంలో నిలిచాడు. టాప్‌-10 వన్డే బౌలర్ల జాబితాలో భారత్‌కు చెందిన ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియాకి చెందిన హేజిల్‌వుడ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా రెండేసి పాయింట్లు కోల్పోయి 13, 15 స్థానాల్లో కొనసాగుతున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 20వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ 13స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలవగా, రవీంద్ర జడేజా మూడు స్థానాలు కోల్పోయి 29స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-10లో ఒక్క రవీంద్ర జడేజాకి మాత్రమే చోటు దక్కింది. జడేజా 254పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కి చెందిన షకిబ్‌ ఆల్‌ హాసన్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. 117 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా(119), ఆస్ట్రేలియా(117) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌ చేరుకున్న ఇంగ్లాండ్‌ జట్టు రెండు పాయింట్లు దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచింది.