ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టాప్ లేపాడు. 873 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ 861 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో విరాట్ రాణిస్తే అతడి రేటింగ్ పాయింట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. టాప్-10లో కోహ్లీ మినహా భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. ధోనీ (12), శిఖర్ ధవన్ (13), రోహిత్ శర్మ (14) టాప్-15లో నిలిచారు. బౌలర్లలో పేసర్ భువనేశ్వర్ కుమార్ 13వ ర్యాంకులో ఉన్నాడు.
జట్టు ర్యాంకుల్లో ప్రస్తుతం మూడో ర్యాంకులోని కోహ్లీసేన (114 పాయింట్లు) అదే స్థానంలో నిలవాలంటే శ్రీలంక సిరీస్‌ను కనీసం 4-1తోకైవసం చేసుకోవాలి. లేనిపక్షంలో 113 రేటింగ్‌తో ఉన్న ఇంగ్లాండ్ భారత్‌ను దాటేస్తుంది.
మరోవైపు శ్రీలంక ప్రమాదంలో పడనుంది. 2019 ప్రపంచకప్ నకు నేరుగా అర్హత సాధించాలంటే భారత్‌పై కనీసం రెండు వన్డేలైనా గెలవాలి. మెగా టోర్నీ అర్హతకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ప్రస్తుతం 88 పాయింట్లతో లంక 8వ స్థానంలో ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రకారం చివరి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత టోర్నీలో తలపడాలి. శ్రీలంకకు తొమ్మిదో స్థానంలోని విండీస్ (78 పాయింట్లు)తో ప్రమాదం పొంచివుంది.