కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు విరాట్ కోహ్లీ, అనుష్క జోడీ తెరదించింది. నాలుగేళ్ల తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్స్టాప్ పెడుతూ సోమవారం ఉదయం పంజాబీ సంప్రదాయంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. నిజానికి 12న వీరి పెళ్లి జరుగుతుందని జోరుగా ప్రచారం సాగింది. ఇరువర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ముందుగా అనుకున్నట్టుగా మిలాన్‌లో జరగలేదు. టస్కనీ నగరానికి సమీపంలోని 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో వైభవంగా జరిగింది. ఇటలీ వైన్ రాజధానిగా పేరు తెచ్చుకున్న మోంటాల్కినోకు గంట ప్రయాణం దూరంలో ఈ సుందరమైన రిసార్ట్ ఉంది. విశాలమైన పచ్చిక బయళ్లు, వైన్ తోటలతో ఈ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది.
ఈ ఏడాది ఆరంభంలో బరాక్ ఒబామా కుటుంబం కూడా ఇక్కడికే విహారానికి వచ్చింది. రిసార్ట్ ఆరంభంలో ఆహుతులకు భాంగ్రా డ్యాన్సర్లు తమ అద్భుత నృత్యంతో స్వాగతం పలికారు. కోహ్లీ, అనుష్కల పెళ్లి దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డి జైనర్ సవ్యసాచి ముఖర్జీ లేత గులాబీ రంగులతో రూపొందించారు. ఇక జనవరి 4న బాంద్రా ఫ్యామిలీ కోర్టులో తమ పెళ్లిని అధికారికంగా రిజిష్టర్ చేసుకోనున్నారు. ఆగస్టులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడే కోహ్లీ, అనుష్క తమ పెళ్లి తేదీలను ఖరారు చేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో రారాజుగా ఉన్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ స్టార్ అనుష్క శర్మ జోడీ కావడంతో అంతా ‘ఈ ఏడాది వివాహం’గా దీన్ని పేర్కొన్నారు. అయితే ఈ వివాహానికి సచిన్, యువరాజ్ వస్తారన్న వార్తలు వచ్చినా, అది నిజంకాలేదు.
21, 26న రెండు రిసెప్షన్లు
కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్‌ను ముంబై, ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ నెల 21న కుటుంబసభ్యులకు ఢిల్లీలోని తాజ్ హోటల్ దర్బార్ హాల్ లో.. 26న ముంబైలో క్రికెటర్లకు, బాలీవుడ్ ప్రముఖులకు విందు ఇవ్వనున్నారు. ఇక ఈ జంట తమ నివాసాన్ని ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న తమ నూతన భవనానికి మార్చనున్నారు.
పెళ్లి ప్రమాణాలు
తమ పెళ్లి ఫొటోలను విరాట్ కోహ్లీ, అనుష్క వేర్వేరుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో ఎప్పటికీ ప్రేమానురాగాలతో కలిసి ఉంటామని మేమిద్దర ప్రమాణం చేశాం. మా పెళ్లి వార్తను అందరితో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా కుటుంబసభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ.. మద్దతుతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. మా ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు కృత జ్ఞతలుఅని కోహ్లీ, అనుష్క తమ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.