భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న 100 మంది ఆటగాళ్ల జాబితాలో కోహ్లి నిలిచాడు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడు కోహ్లి కావడం విశేషం. ఈ జాబితాలో సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లి 89వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి మొత్తం సంపాదన 22 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపాయలలో సుమారు రూ.141 కోట్లు అనమాట. దీనిలో మూడు మిలియన్ డాలర్లు మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి రాగా, మిగిలిన 19 మిలియన్ డాలర్లు వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారా వచ్చినవే.
కాగా, ఫోర్బ్స్ జాబితాలో టాప్ 1గా నిలిచిన క్రిస్టియానో రొనాల్డో సంపాదన 93 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 598 కోట్లు). ఇక ఈ జాబితాలో అమెరికన్ బాస్కెట్బాల్ స్టార్ లెబ్రోన్ జేమ్స్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని సంపాదన 86.2 మిలియన్ డాలర్లు.అయితే ఈ 100 సంపన్న క్రీడాకారుల జాబితాలో కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే ఉండటం గమనార్హం. ఆమె ఎవరో కాదు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. 27 మిలియన్ డాలర్ల సంపాదనతో సెరెనా 51వ స్థానాన్ని ఆక్రమించింది.