వెస్ట్ ఇండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో యువ ఆటగాడు రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. రెండో వన్డే అనంతరం సారథి కోహ్లీ మాట్లాడుతూ తదుపరి వన్డేలో యువ ఆటగాడు రిషబ్పంత్కి జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని తెలిపాడు. ఆంటిగ్వాలో జరిగే మూడో వన్డే కోసం భారత జట్టులో కొన్ని మార్పులు చేస్తామని, కొత్త వారికి అవకాశం ఇస్తామని, దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోహ్లీ వివరించాడు. వన్డే ప్రపంచకప్ కోసం జట్టులో కొన్ని మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాళ్లు ఇటీవల వ్యాఖ్యలు చేసిన దృష్ట్యా, ధోనీ స్థానంలో రిషబ్పంత్కి కోహ్లీ అవకాశం ఇచ్చి వికెట్ కీపర్ బాధ్యతలు అప్పగించి పరీక్షించాలని భావిస్తున్నారు. మూడో వన్డేలో ఆడే తుది జట్టులో పంత్ చోటు దక్కించుకుంటే అదే అతని తొలి అంతర్జాతీయ వన్డే కానుంది. రెండో వన్డేలో భారత్ 105పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.