విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) మృతి చెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు లోక్ సభ కి ఎన్నికయింది. ఈమె ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు కుమార్తె.
విద్య విజయనగరంలో 1934లో జన్మించారు. 1950లో చెన్నుపాటి శేషగిరిరావును ఆమె వివాహం చేసుకున్నారు. 1980లో తొలిసారి విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో రెండోసారి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.
అసలు 1974లోనే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే దరఖాస్తులో కులం, మతం అనే కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారు కాలేదు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. కులం, మతం అవసరం లేని రోజున తనను పిలవాలని నేరుగా ఇందిరాగాంధీకి లేఖ రాశారు.
కాగా, విద్య మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహా వివిధ పార్టీల నేతలు విద్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు.