//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ...!

Category : editorial

జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, ఈ మూడూ ప్రతిఒక్కరు కోరుకొనేవి మరియు కోరదగినవి. ఈ ‘కోరదగిన’ విషయాలను ‘వరం’ అంటారు. ఈ మూడింటి స్వరూపమైన దేవతాశక్తి ‘వరలక్ష్మి’. ఈ వరలక్ష్మి వ్రతం గురించి పరమ శివుడు పార్వతి దేవి కి ఎలాచేయాలో వివరించాడు. ఈ కథ గురించి సూత మహాముని

శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

దానికి పరమ శివుడు, కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు.

ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.

అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.