దేశీయ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ బోర్డు నుంచి వాణి కోలా వైదొలిగారు. స్నాప్‌డీల్ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్న జాస్పర్ ఇన్ఫోటెక్ బోర్డులో ఆమె సెప్టెంబర్ 2009లో చేరారు. సంస్థ బోర్డులో కలారి క్యాపిటల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డైరెక్టర్ వాణి కోలా ఈనెల 2న రాజీనామా చేశారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు జాస్పర్ ఇన్ఫోటెక్ సమాచారం అందించింది. కోలా తన రాజీనామా పత్రంలో ఎలాంటి కారణాలు పేర్కొనలేదని, బోర్డులో ఇకపై కొనసాగలేనని, వెంటనే తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు సంస్థ వెల్లడించింది. ఈ విషయంపై మరింత వివరణ కోరుతూ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) పంపిన మెయిల్స్‌కు స్నాప్‌డీల్, వాణి కోలా స్పందించలేదు.