Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వనదుర్గమ్మా.. దారి చూపమ్మా..!

Category : state editorial

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నర్సాపూర్‌-మెదక్‌ మార్గంలో కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపం నుంచి ఏడుపాయల ప్రాంగణానికి చేరుకునేందుకు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, జోగిపేటతోపాటు మెదక్‌ వైపు నుంచి వచ్చేవారు సైతం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు.

మట్టిరోడ్డే అయినా నిన్నమొన్నటి వరకు ఇబ్బంది లేకపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కార్లు, ద్విచక్ర వాహనాలు బురదలో దిగబడటంతో వాటిలో వచ్చినవారు నానా ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ముందుకు సాగక, చిత్తడిగా ఉండటంతో కిందకు దిగే పరిస్థితి లేక అవస్థల పాలయ్యారు. పలుప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. పలు కార్లు బురదలో కూరుకుపోవడంతో కొందరు వెనకనుంచి తోసి బయటకు లాగగా, మరికొన్ని కార్లను లాగేందుకు ఇతర వాహనాలను వినియోగించాల్సి వచ్చింది. రోడ్డు పరిస్థితి చూసిన కొందరు వాహనదారులు ఈ మార్గంలో వెళ్లే పరిస్థితి లేదని గుర్తించి మంబోజిపల్లి మీదుగా బోడ్మట్‌పల్లి మార్గంలో చుట్టూ 25 కి.మీ. తిరిగి ఏడుపాయలకు చేరుకున్నారు. ఎక్కువమంది వాహనదారులు పోతంశెట్టిపల్లి వైపు నుంచే ఏడుపాయలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నందున ఈ రహదారిని పటిష్ట పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మంజీరా నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ రోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేస్తే వర్షం కురిసినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ దిశగా సంబంధిత శాఖల అధిరాకారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

లోపించిన పారిశుద్ధ్యం

వర్షంతో ఆలయానికి వచ్చే రహదారులు అధ్వానంగా మారగా ఆలయ పరిసరాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వారాంతపు సెలవులు, పండగల సమయంలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. మంజీరా నదీపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. స్నానాలు ఆచరించే చెక్‌డ్యాం వద్ద మురుగు కుంటలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉంది. దర్శనానికి వెళ్లే దారిలో గోపురానికి సమీపంలో మురుగు పేరుకుపోయింది. ఏడాది పొడవునా భక్తులతో సందడిగా ఉండే ప్రదేశంలో పారిశుద్ధ్యం లోపించడంతో అవస్థలు తప్పడం లేదు. ఆదివారాల్లో అయితే సత్రాలు, షెడ్లు అన్నీ నిండిపోయి ఎంతోమంది ఆరుబయట చెట్ల కింద బసచేసి అక్కడే వంటలు, భోజనాలు చేస్తారు. సరైన మురుగు వ్యవస్థ, చెత్తకుండీలు లేకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక దోమల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మూగజీవాల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తుంటాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లోని అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ బురదమయంగా మారతాయి. అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో రాజగోపురం నుంచి ఘనపూర్‌ ఆనకట్ట వరకు అధ్వానంగా ఉండటంతో చిన్నపాటి వర్షం కురిస్తే బురదమయంగా మారుతోంది. కాలినడకకు సైతం వీల్లేని దుస్థితి నెలకొంటోంది. హరిత రెస్టారెంట్ కాటేజీలు, సత్రాల నుంచి వచ్చే మురుగు ఒకచోట చేరి దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పందులు సత్రాల వద్ద స్వైరవిహారం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుదామని వచ్చే భక్తులు ఇక్కడ దుర్గంధభరిత వాతావరణాన్ని చూసి భీతిల్లుతున్నారు. దారులను బాగుచేయడంతో పాటు స్నానఘట్టాలు, సత్రాల వద్ద ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.