వివిధ సాహస కృత్యాలతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్యన్ సాహసికుడు ప్రమాదవశాత్తూ హిమాలయాలపై ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే... బేస్ జంపర్ వలెరి రొజోవ్ (52) నేపాల్ లోని హిమాలయాల్లో 6,812 మీటర్ల ఎత్తున్న అమ డాబ్లం పర్వత శ్రేణిపైనుంచి కిందికి దూకాడు. మామూలుగా బేస్ జంప్ లో వింగ్ సూట్ వేసుకుని ఎత్తయిన పర్వతం లేదా కొండ పైనుంచి దూకుతారు. గాలివాటాన్ని వినియోగించుకుని దిశమార్చుకుంటూ పర్వతాల దగ్గరగా వెళ్తూ తమను తాము రక్షించుకుంటూ కిందికి దిగుతారీ బేస్ జంపర్లు.
ఇలాంటి సాహసాలు చేసే వలెరి రొజోవ్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 2013లో 7220 మీటర్ల ఎత్తున్న పర్వతం పైనుంచి బేస్ జంప్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అనంతరం 2016లో మరోసారి 7700 మీటర్ల ఎత్తైన పర్వతం నుంచి బేస్ జంప్ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు.
అయితే గత రికార్డు ఎత్తుకంటే తక్కువ ఎత్తున్న అమ డాబ్లం పర్వతంపైనుంచి కిందికి దూకుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతని మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆయన మృతదేహం కోసం గాలిస్తున్నారు.