ఉత్తర కొరియా చెర నుంచి విడుదలైన అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్బైర్ మృతిచెందాడు. 22 ఏళ్ల వార్మ్బైర్ దాదాపు 15 నెలల పాటు ఉత్తర కొరియాలో జైలుశిక్ష అనుభవించాడు. ఆ దేశానికి చెందిన ఓ కీలకమైన దస్త్రాన్ని దొంగలించేందకు ప్రయత్నించిన అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. గత ఏడాది తన తప్పును ఒప్పుకున్న వార్మ్బైర్ ఆ తర్వాత కోమాలోకి వెళ్లాడు. దాదాపు ఏడాది పాటు కోమాలో ఉన్న వార్మ్బైర్ వారం రోజుల క్రితమే స్వదేశానికి వెళ్లాడు. మానవత్వ కోణంలో అమెరికా విద్యార్థిని విడిచిపెట్టినట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. వార్మ్బైర్కు పక్షవాతం వచ్చినట్లు కొరియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా, నార్త్ కొరియా మధ్య ఇటీవల సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ దేశాల మధ్య వాతావరణం మరింత వేడెక్కనున్నది. ఉత్తర కొరియా పెట్టిన చిత్రహింసల వల్లే వార్మ్బైర్ మృతిచెందినట్లు అమెరికా ఆరోపిస్తున్నది.