అనుకొంటున్నట్లుగానే పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించడంతో పర్యావరణ పరిరక్షణకు పెను విఘాతం ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం.
ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి 190 దేశాలకు పైగా అంగీకరించాయి. తాజా నిర్ణయంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించని సిరియా, నికరాగువా దేశాల సరసన అమెరికా చేరింది. తమ దేశం, పౌరుల పట్ల ఉన్న విద్యుక్త ధర్మాన్ని నిర్వహించేందుకే ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు శ్వేతసౌధంలో ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా కొత్త షరతులతో ఇదే ఒప్పందంలో కొనసాగడమా?లేక కొత్త ఒడంబడికను రూపొందించడమా అన్నదానిపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందన్నది ట్రంప్ వాదన. ‘‘ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమే కాదు. ఉద్యోగ కల్పననూ దెబ్బతీస్తుంది. భారత్, చైనా లాంటి దేశాలకు ఇది అనుకూలంగా ఉంది’’ అని ట్రంప్ అన్నారు.
ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, ఉద్గారాలను తగ్గించే భారం ఇతర దేశాలపై మరింతగా ఉండనుంది. చైనా, భారత్, ఐరోపాలోని దేశాలు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇంతకుముందే స్పష్టం చేశాయి.
ట్రంప్ పొరబాటు చేశారని, అమెరికా ప్రజల పట్ల ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, ఇది భావితరంపై ప్రభావం చూపుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్ విమర్శించారు. అంతేగాక, అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారిని ఫ్రాన్స్ తమ దేశానికి స్వాగతిస్తోందని, వారందరికీ ఫ్రాన్స్ మరో స్వదేశం అవుతుందని మేక్రాన్ చెప్పారు.
అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమెరికా ఒప్పందం నుంచి వైదొలగడం అసంతృప్తిని కలిగించిందని ట్రూడో అన్నారు. తాము మాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.