ఉగ్రవాదం భారత సైన్యాన్ని బలిగొని భారత దేశం లో విషాదం నింపింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి లో 40 మంది సైన్యం అశువులుబాశారు. ఇది దేశం జీర్ణించుకోలేని పెను విషాదం. ఇప్పటికే ఈ దాడి తో రగిలి పోతున్న భారతదేశానికి అండగా నిలబడటానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వాటిని తాము సమర్థిస్తామని అమెరికా ప్రకటించింది.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్.. భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో ఫోన్లో మాట్లాడి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పూర్తి మద్దతు ఇస్తామని బోల్టన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
'పుల్వామా ఘటనపై సంతాపం తెలియజేసేందుకు అజిత్ డోభాల్‌తో మాట్లాడాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఆత్మరక్షణ చర్యలను మేం సమర్థిస్తాం. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉండొద్దని ఆ దేశానికి చెబుతూనే ఉన్నాం' అని బోల్టన్ తెలిపారు.
అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో కూడా ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. 'ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మేం అండగా ఉంటాం. అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇవ్వకూడదు' అని పాంపెయో ట్విటర్లో పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది.జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై భీకర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.