//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీఎస్టీ రూపకల్పనలో అజ్ఞాత యోధులు ఎందరో !

Category : national

జూన్ 30 అర్ధరాత్రి అట్టహాసంగా ప్రపంచంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో దీనిని అమలు చేస్తున్న దేశాల సరసన ఏడో  దేశంగా భారత్ నిలిచింది. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత ఒక మార్పు తీసుకురావడానికి ఇంత భారీ ఎత్తున కసరత్తు మరెప్పుడు జరగలేదని చెప్పవచ్చు. 1985లో నాటి ఆర్ధిక మంత్రి విపి సింగ్ కొన్ని వస్తువులకు మొడీఫైడ్ వేల్యూ యాడెడ్ పన్ను ప్రవేశ పెట్టడంతో ఈ పక్రియ ప్రారంభమైనది. ఈ మూడు దశాబ్దాలలో అందుకోసం కృషిచేసిన అజ్ఞాత యోధులు అనేకమంది ఉన్నారు. 

ముఖ్యంగా ప్రస్తుత చట్టం కోసం గత దశాబ్ద కాలంగా విశేష కృషి జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లు 2016 ఆగస్టులో జరుగగా, 175 అధికారుల సమావేశాలు, 18 జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఇందుకు 18 వేల పనిగంటలు కూడా పట్టాయి.  దాదాపు 30 సబ్-గ్రూపులు, కమిటీలు 1200 వస్తు, సేవల పన్నును నిర్ణయించడానికి అలసట అనేది లేకుండా శ్రమించారు. చివరికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంది. అరుణ్ జైట్లీ తొమ్మిది నెలలపాటు నెలకు సగటున రెండు సార్లు సమావేశంలో కూర్చున్నారు.

ఇక ఫిట్‌మెంట్, రేట్ కమిటీ అధికారులైతే వారానికి మూడు నుంచి నాలుగుసార్లు సమావేశానికి హాజరయ్యారు. కౌన్సిల్‌కు ఆమోద యోగ్యమైన, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమ్మతి కుదిరేలా అభిప్రాయభేదాలను పరిష్కరించారు.ఢిల్లీలో కేంద్ర, రాష్ట్రపభుత్వ అధికారుల విస్తృత చర్చల అనంతరం కొత్త పన్ను చట్టానికి పునాదులు వేశారు.

దీని వెనుక రెవెన్యూ సెక్రటరీ హస్‌ముఖ్ ఆదియా, సిబిఇసి చైర్‌పర్సన్ వనజా సార్నా ముందు వరుసలో ఉన్నారు. కాగా జీఎస్టీ కమిషనర్ ఉపేంద్ర గుప్తా, రెవెన్యూ శాఖలో కన్సల్టెంట్ పి.కె. మోహంతి, సంయుక్త కార్యదర్శి(టిఆర్‌యు) అలోక్ శుక్లా, సిబిఇసి చీఫ్ కమిషనర్ పి.కె. జైన్, సిబిఇసి కమిషనర్ మనీశ్ సిన్హా, తదితరులెందరి శ్రమ దాగుంది. తెర వెనుక ఎన్నో సమస్యలను కేంద్ర అధికారులు పరిష్కరించారు. 

రాష్ట్రప్రభుత్వ అధికారులలో కర్నాటకకు చెందిన వాణిజ్య పన్ను కమిషనర్ రిత్విక్ పాండే, గుజరాత్ వాణిజ్య పన్ను కమిషనర్ పి.డి.వాఘేలా, మహారాష్ట్ర వాణిజ్య పన్ను కమిషనర్ రాజీవ్ జలోటా, బీహార్ వాణిజ్య పన్ను అదనపు కార్యదర్శి అరుణ్ మిశ్రా, పశ్చిమబెంగాల్ అదనపు కమిషనర్ అన్వర్ ఖాలిద్ వంటి వారి నుంచి వినూత్న సూచనలు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. వినియోగదారులకు సులువుగా ఉండేలా జీఎస్టీ రేట్లు, నియమాలు రూపొందించడంలో అన్ని రాష్ట్రాల అధికారులు ఓవర్‌టైమ్ వర్క్ చేశారు.

జీఎస్టీ రాజ్యాంగ సవరణ చట్టం, రాష్ట్రాలకు పరిహారం చట్టం రూపొందించడంలో రెవెన్యూ సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమావత్ కీలక వ్యక్తిగా నిలిచారు. సంస్కరణలకు అనుగుణంగా అధికారులను సిద్ధం చేయడంలో ట్రయినింగ్ అకాడమీని పి.కె. దాష్ (డైరెక్టర్ జనరల్-ట్రయినింగ్) విశేషంగా కృషి చేశారు. అకాడమీలో దాదాపు 55 వేల మంది రాష్ట్ర, కేంద్ర అధికారులకు శిక్షణ ఇచ్చారు. కమిషనరేట్ స్థాయిలో ఇన్-హౌస్ ట్రయినింగ్ ప్రోగ్రాంలు నిర్వహించారు. ఇ-ట్రయినింగ్ మాడ్యూల్స్‌ను కూడా విడుదల చేశారు.