//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నవంబర్ లోనే కేంద్ర బడ్జెట్ ? జనవరి నుండే ఆర్ధిక సంవత్సరం !

Category : national

ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుండి కాకుండా జనవరి నుండి ప్రారంభించాలని భావిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పర్యాయం నవంబర్ లోనే బడ్జెట్ ను ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. నూట యాభై ఏండ్ల సంప్రదాయానికి చరమగీతం పాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని ఏప్రిల్‌తో కాకుండా నూతన సంవత్సరం ప్రారంభమయ్యే 2018 జనవరి నెలతో మొదలుపెట్టాలని యోచిస్తున్నది. 

ఆర్థిక సంవత్సర కాలాన్ని మార్చాలని ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా సూచించిన నేపథ్యంలో క్యాలెండర్ మార్పుతోనే ఆర్థిక సంవత్సరాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ను ప్రవేశ పెట్టె  ఆనవాయితీకి భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆర్థిక సంవత్సరాన్ని కూడా మారిస్తే అది మరో చారిత్రక మార్పుకాగలదు. 

 ప్రస్తుతం అధికారులు చర్చిస్తున్న ప్రతిపాదనల ప్రకారం బడ్జెట్ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు రెండు నెలల సమయం తీసుకుంటున్నందున పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నవంబర్ మొదటి వారంలోనే నిర్వహించాలి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరాన్ని 1867 నుంచి అమలు చేస్తున్నారు. 

అంతకుముందు భారత్‌లో ఆర్థిక సంవత్సరం మే నెల ఒకటో తేదీన ప్రారంభమై ఏప్రిల్ 30న ముగిసేది. అయితే క్యాలెండర్‌తోపాటే ఆర్థిక సంవత్సరం కూడా మారాలని ప్రధాని అభిప్రాయపడిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన కమిటీ డిసెంబర్‌లోనే నివేదికను అందజేసింది.