మొదటిసారి ఉగ్రవాదం విషయంలో అమెరికా పాకిస్థాన్ ను నేరుగా హెచ్చరించింది. ఉగ్రవాదులకు నీడనిస్తున్న పాకిస్థాన్ ను ఇంకేమాత్రం సహింపబోమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ ఆసియాపై అనుసరించాల్సిన రక్షణ వ్యూహాన్ని తాజాగా ప్రకటించిన ట్రంప్ ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాద సంస్థలుకు పాకిస్థాన్ ఆరామంగా మారిందని, దీని పట్ల తాము మౌనంగా ఉండబోమని ట్రంప్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ శాంతి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ అండగా నిలివాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేరగాళ్లు, ఉగ్రవాదులకు ఊతం ఇవ్వడం వల్ల పాకిస్థాన్ నష్టపోతుందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయని పక్షంలో అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్‌కు రక్షణ సహాయం నిలిపేస్తామని ట్రంప్ వెల్లడించారు.
ఉగ్రవాదంపై పోరాటం కోసం పాకిస్థాన్‌కు బిలియన్ల డాలర్లను ఇస్తున్నామని, కానీ ఆ దేశం మాత్రం ఉగ్రవాదులకు నీడనిస్తున్నదని ఆప్పించారు. ఇలాంటి ధోరణి మారాలని, అది తప్పకుండా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు సరైన నాగరికతను అలవాటు చేసుకునే సందర్భం వచ్చిందని, శాంతి స్థాపనకు ఆ దేశం సహకరించాలని స్పష్టం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులకు రష్యా, చైనా లతో కలసి పాకిస్తాన్ సహకారం అందిస్తునందుకే ట్రంప్ ఆగ్రహం చెందుతున్నట్లు తెలుస్తున్నది.
మరో వైపు భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను వెనక్కి రప్పించాల్సిన అంశంపైన కూడా ట్రంప్ స్పందించారు. అమెరికా దళాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరిస్తే, అక్కడ మళ్లీ ఉగ్రవాదులు పేరుకుపోయే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. ఇరాక్‌లో చేసిన తప్పును ఇక్కడ చేయలేమని స్పష్టం చేశారు. అభివృద్ధి సాధిస్తున్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు సహకరిస్తూనే ఉంటామని తెలిపారు.