ఐక్యరాజ్యసమితి ఆంక్షలను సైతం ధిక్కరిస్తూ అణు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురి చేస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సర్వం సిద్ధం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. స్వీయ రక్షణ కోసం తమ భూభాగం మీదుగా ప్రయాణించే యూఎస్ బాంబర్లను కూల్చివేయగలమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి ప్రకటనపై ట్రంప్ స్పందించారు.
సైనిక చర్య అనేది తమ తొలి ప్రాధాన్యత కాదని, రెండో ఆప్షన్ గానే దాన్ని ఎంపికచేసుకున్నామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఒకవేళ తాము రంగంలోకి దిగితే మాత్రం పూర్తి విజయం సాధించే వరకూ వదిలే ప్రసక్తేలేదని స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్తో కలసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తెలిపారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రవర్తన దురుసుగా ఉందని, గతంలో ఎన్నడూ లేనంతగా రెచ్చిపోతున్నాడని ట్రంప్ ఆరోపించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే తాను సమాధానం ఇస్తున్నానని, ఇది తన అసలు స్టేట్మెంట్ కాదని, అయితే, గతేడాది పోలిస్తే ఈసారి ఉద్రిక్తతలు మరింత పెరిగాయని అంగీకరించారు. అత్యంత సులభంగా సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి ఉన్నా ఉత్తర కొరియా ఆ పనిని పక్కన బెట్టి, జఠిలం చేసుకుందని విమర్శించారు.