అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు. జెరూసలెంను ఇజ్రాయెల్ దేశ రాజధానిగా గుర్తించనున్నట్లు వైట్‌హౌస్ సీనియర్ ప్రతినిధులు వెల్లడించారు. బుధవారం ట్రంప్ ఈ ప్రకటనను చేయనున్నట్లు పేర్కొన్నారు.అంతేకాదు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ఇదివరకే అరబ్ నేతలు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమెరికా ఎంబసీని జెరూసలెంకి మారిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు.
పాలస్తీనియులకు, ఇజ్రాయెలీయులకు పవిత్ర ప్రాంతం జెరూసలెం. ఇజ్రాయెల్ వాసులు చాలా కాలంగా జెరూసలెంని రాజధానిగా భావిస్తున్నారు. కానీ పాలెస్తీనియులు మాత్రం భవిష్యత్తులో ఏర్పడబోయే రాజ్యానికి తూర్పు జెరూసలెంని రాజధానిగా ప్రకటించాలని భావిస్తున్నారు.ఈ విషయమై ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో పాటు వివిధ అరబ్ నేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా ఎంబసీని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు మారిస్తే హింసాత్మకఘటనలు చోటుచేసుకుంటాయని, ప్రపంచంలోని ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని సౌదీ అరేబియా రాజు సల్మాన్ ట్రంప్‌కు చెప్పారు.
మరో పక్క ట్రంప్ నిర్ణయంపై ఇస్లాం వర్గాలు మూడు రోజుల పాటు నిరసనకు పిలుపునిచ్చాయి.జెరూసలెంను రాజధానిగా మార్చాలన్న ఆలోచనట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్దేనట. ఆరు నెలల క్రితం టెల్ అవీవ్ నుంచి అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని మార్చాలా వద్దా అని ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలో ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య శాంతి భద్రతలు మెరుగుపడతాయంటూ కుష్నరే ట్రంప్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.