ప్రపంచ దేశాలను రెచ్చగొట్టే రీతిలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియా మాటలతో వినేరకం కాదని, చేతల్లోనే దానికి సమాధానం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఉత్తర కొరియాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. యుద్ధ వాతావరణం తగ్గినట్లే తగ్గి మళ్లీ రాజుకోవడంతో ఉత్తరకొరియాను దృష్టిలో ఉంచుకుని ఓ న్యూక్లియర్ సూపర్ బాంబ్‌ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించడం ఆ దేశాన్ని కలవరానికి గురిచేస్తున్నది.
అమెరికా బుధవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. జపాన్ మీదుగా ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన మరుసటి రోజుననే అమెరికా క్షిపణి భద్రతా సంస్థ(ఎండిఎ), నౌకాదళం సంయుక్తంగా ఖండాంతర క్షిపణిని పరీక్షించడం ప్రాధాన్యతను సంతరింప చేసుకొంది.
ఉత్తరకొరియా మంగళవారం నిర్వహించిన క్షిపణి ప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో క్షిపణి పరీక్షలు నిర్వహించరాదని, అన్ని అణ్వాయుధ కార్యక్రమాలు తక్షణమే నిలిపివేయాలని భద్రతా మండలి డిమాండ్ చేసింది అయితే అమెరికా క్షిపణి పరీక్షను మాత్రం ఐరాస ఖండించలేదు.
మరోవైపు జపాన్ కూడా భూఉపరితల లక్ష్యాలను అధిగమించే ఏజిస్ శ్రేణిలోని ఖండాంతర క్షిపణి వ్యవస్థను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 2023 నాటికి దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రకటించింది. అమెరికా క్షిపణిని హవాయిలో పరీక్షించింది. కాగా, వాయుసేన పరీక్షించిన బీ61-12 బాంబును కిమ్ దేశాన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ట్రంప్ కఠిన వైఖరి ఉత్తర కొరియాలోని కిమ్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. "ఉత్తర కొరియాతో గత 25 ఏళ్లుగా అమెరికా మాట్లాడుతూనే ఉంది. దానికి బలవంతపు సొమ్ము చెల్లిస్తూనే ఉంది. ఇక చర్చలు సమాధానం కాదు" అని ట్రంప్ తీవ్ర స్వరంతో ట్వీట్ చేశారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలు ఆయన కేబినెట్ సీనియర్ అధికారుల వైఖరికి భిన్నంగా ఉండటం గమనార్హం. ఉత్తర కొరియా అణుపరీక్షల నేపథ్యంలో ఆ దేశంతో శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం గతంలోలాగా క్షిపణీ పరీక్షలు నిలిపివేయాలని కోరుతూ, అందుకు బదులుగా కొరియాకు సాయాన్ని అందించే చాన్సే లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
గతంలో అణు ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఉత్తర కొరియాకు ఆహారాన్ని, సహాయ ప్యాకేజ్‌లను అమెరికా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అణుపరీక్షలు నిర్వహించబోనంటూ అమెరికా నుంచి సాయాన్ని పొందిన కొరియా ఆ తర్వాత పలు సందర్భాల్లో తన వాగ్దానాలను ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉత్తరకొరియాతో చర్చలు ఉండబోవని, ఇక ఆ దేశంపై చర్యలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ ప్రకటించడం సహజంగానే కిమ్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నది.
.