భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడానికి ముందు తాను భారత దేశానికి మంచి మిత్రుడను అనే సంకేతం ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద కసరత్తే చేశారు. మోడీతో, ఇతర భారతీయులతో మాట్లాడే సందర్భంలో ఉపయోగించడం కోసం కొన్ని హిందీ పదాలను కూడా నేర్చుకున్నారు.
ఇద్దరు దేశాధినేతల మధ్య నెలకొన్న అంతరాన్ని తొలగించు కోవడం కోసం రెండు దేశాల మధ్య రక్షణ సహకారంతో పాటు ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలుస్తున్నది. మరో వంక మోడీ గురించిన వివరాలను సహితం ఉన్నత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు రెండు దేశాల అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు గత మార్చి లోనే మోడీ అమెరికా పర్యటన జరుపవలసి ఉంది. అయితే ఆ సమయంలో ఆయన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో తీరిక లేకుండా ఉండడంతో వెళ్లలేక పోయారు.
‘ప్రధాని నరేంద్రమోదీతో అయ్యే భేటీ కోసం డోనాల్డ్ ట్రంప్ హిందీ పదాలు నేర్చుకుంటున్నారు. ఆయన ట్రంప్ సర్కార్ మోదీ సర్కార్కు స్వాగతం పలుకుతోంది’ అనే పదాలు ఉపయోగిస్తారని చికాగోకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శలబ్ కుమార్ చెప్పారు.
ఈయన అమెరికా ఎన్నికల్లో భారత కమ్యునిటీని ట్రంప్ ఆకట్టుకునేలా వ్యూహాలు రచించారు. ఆ సమయంలో కూడా ట్రంప్ ఓసారి భారత కమ్యూనిటీని ఉద్దేశిస్తూ `ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్' అనే పదాలు ఉపయోగించారు. ఆప్ కీ బార్ మోదీ సర్కార్ అనే నినాదాన్ని భారత్లో ఎన్నికలకు ప్రధాని మోదీ ఉపయోగించిన విషయం తెలిసిందే.