'ట్రంప్ ఓ దురహంకారి' అని ప్రపంచ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి భావిస్తున్నట్లు 'ప్యూ' పరిశోధనా సంస్థ' నిర్వహించిన సర్వేలో తేలింది. సర్వే జరిపిన మొత్తం 37 దేశాల్లో 26 దేశాల ప్రజలు 'ట్రంప్ ప్రమాదకారి' అని చెప్పారు. పెరు, బ్రెజిల్, దేశాల్లోని పౌరులు ట్రంప్ విధానాలపై ఆందోళన పడుతున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక తమ దేశంతో సంబంధాలు మెరుగయ్యాయని కేవలం 15 శాతం మంది మాత్రమే చెప్పారు.
ఇక స్వంత దేశం అమెరికాలో కూడా ట్రంప్ పట్ల ప్రజల అభిప్రాయాల్లో పెద్దగా మార్పు రాలేదు. కేవలం 39 శాతం అమెరికన్లు ఆయనకు మద్దతు పలికారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాగా పనిచేస్తున్నారని రిపబ్లికన్ పార్టీలో 81 శాతం మంది మెచ్చుకుంటున్నారు.
ట్రంప్ వల్ల ప్రపంచానికి మంచి జరిగే అవకాశం లేదని అనేక దేశాల్లోని ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ సంబంధాల విషయంలో అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు ఎంచుకున్న విధానాల పట్ల విశ్వాసం వ్యక్తం కాలేదు. ఇజ్రాయిల్, రష్యా దేశాల్లో తప్ప మిగతా 35 దేశాల్లోని ప్రజలు ట్రంప్‌పై సరైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి-మే మధ్యకాలంలో 37 దేశాల్లో 40 వేలమందిని ఇంటర్వ్యూ చేశారు.
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కన్నా, గత అధ్యక్షుడు ఒబామా మేలని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయిల్, రష్యాలలో మాత్రం ట్రంప్ పట్ల ఎక్కువ సానుకూలత వ్యక్తమైంది. ప్రపంచ సంబంధాల్లో ట్రంప్ చేస్తున్నదంతా సరైనదేనా ? అన్న ప్రశ్నకు అమెరికా మిత్ర దేశాల్లోనే వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమైంది. ద.కొరియా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాల్లో ఒబామా పాలనే బాగుందన్నారు.
నాటో సభ్య దేశాల్ని తమ వాటా చెల్లించాలని కోరటం, యూరప్‌లోని అమెరికా మిత్ర దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. యూరప్ ఇక ఎంతమాత్రమూ అమెరికాపై ఆధారపడలేదని ఏంజెలా మెర్కెల్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జర్మనీలో ట్రంప్‌నకు పెద్దగా ఆదరణ దక్కలేదు.
వీసా నిబంధనలను కఠినతరం చేయటం భారతీయుల్ని ఆగ్రహానికి గురిచేసింది. ఇండియాలో 40 శాతం మంది మాత్రమే ట్రంప్ విధానాలకు మద్దతు పలికారు. అలాగే ఆరు ముస్లిం దేశాలపై 'ట్రావెల్ బ్యాన్' నిర్ణయం కూడా ఆయనకు చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఈ సర్వేలో 62 శాతం ప్రజలు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు.