పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి తాంత్రిక పూజలు చేశారంటూ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని అవసరమైనప్పుడు బయటపెడతానని కూడా ఆయన అన్నారు. ఆ పూజలు నిర్వహించిన పూజారి పేరు నరసింహ అని, అవసరమైతే మీడియా కూపిీ లాగాలని ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేశ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియా బయటపెట్టింది. కానీ, కత్తి మహేశ్ చెప్పినట్టు పవన్, త్రివిక్రమ్ చేసింది తాంత్రిక పూజలు కాదని, నరసింహస్వామి ఆలయంలో యాగం సందర్భంగా నిర్వహించిన పూజలని తేలింది. దీనిని త్రివిక్రమ్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రకారం, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్.జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా మహా సంపుటిత, శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన యాగం నిర్వహించడం ఆనవాయతీ.
మహాశివరాత్రి ముందు రోజు, మహాశివరాత్రి రోజున ఈ యాగం నిర్వహిస్తుంటారు. ఇక్కడి స్వామి వారి పై త్రివిక్రమ్ కు నమ్మకం ఎక్కువ. దీంతో, ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే యాగానికి ఆయన హాజరవుతుంటారు. ఆ సమయంలో తాను ఏ సినిమాకు అయితే దర్శకత్వం వహిస్తున్నాడో, ఆ సినిమా యూనిట్ లోని ముఖ్యులను ఈ యాగానికి ఆయన ఆహ్వానిస్తుంటారు. 2009లో ఈ యాగంలో పవన్-త్రివిక్రమ్ పాల్గొన్నారని, 2014లో త్రివిక్రమ్ తో పాటు నటుడు సునీల్ కూడా ఇక్కడికి వచ్చారని అక్కడి పండితులు చెబుతున్నారు.
కాగా, 2009 నుంచి 2014 వరకు వరుసగా ఇక్కడ నిర్వహించిన యాగానికి త్రివిక్రమ్ హాజరయ్యారు. అలాగే, ఇక్కడ ప్రతి శివరాత్రికి నిర్వహించే సుదర్శన యాగంలో సినీ ప్రముఖులు చాలా మంది పాల్గొంటూ ఉంటారని అక్కడి పూజారి చెప్పారు. పూజారి వివరణతో పవన్ - త్రివిక్రమ్ కలిసి చేసిన ఈ పూజలు తాంత్రిక పూజలు కాదనే విషయం స్పష్టమవడం గమనార్హం.