ఓ పక్క దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ట్రిపుల్ తలాఖ్ ఫై ముస్లిం మహిళలు పోరాటం చేస్తుంటే మరోపక్క ఆ ట్రిపుల్ తలాఖ్ ఉదంతాలు కొత్త దార్లు తొక్కుతున్నాయి. షరియా నిబంధనల ప్రకారం ముస్లిం వ్యక్తి ఎవరైనా తన భార్యకు మూడు సార్లు తలాఖ్ చెప్పడం ద్వారా ఆ పవిత్రబంధంకి ముగింపు పలకవబచ్చు. ఐతే ఒకప్పుడు పెద్దల సమక్షంలోనో, ముఖాముఖి జరిగే తలాఖ్ వ్యవహారం ఇప్పుడు భిన్న పోకడలు పోయింది. సోషల్ మీడియా, పేస్ బుక్, ట్విట్టర్లు మానవ జీవితంలో చొరబడటంతో వాటి ద్వారాను తలాఖ్ చెప్పేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇదే అదునుగా మరికొంతమంది విదేశాలనుండి ఫోన్ కాల్స్ తో, లోకల్ పేపర్ ప్రకటనల ద్వారానో తలాఖ్ చెప్పేసి గుట్టుగా తప్పించుకుంటున్నారు. తాజాగా సౌదీలో పనిచేస్తున్న ఓ బ్యాంకర్ హైదరాబాద్ లో వున్న తన భార్యకు ఓ లోకల్ ఉర్దూ పేపర్ లో ట్రిపుల్ తలాఖ్ ప్రకటన చేసాడు. అది చూసి నివ్వెరపోయిన అతడి భార్య ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఆ కేసు దర్యాప్తు నడుస్తోంది. ఐతే అది షరియా చట్టలకి లోబడి ఉంటే పోలీసులు కూడా ఏమి చేయలేరు. నలుగురు ముందు నిఖా చేసుకున్న తన భర్త తలాఖ్ ను కూడా ఆ నలుగురు ముందే చేసుకోవాలని ఆమె నేడు వాదిస్తోంది. ఐతే ఈ వేదన కేవలం ఆమె ఒక్కరిదే కాదు, ఆమెలాంటి మరెందరో ముస్లిం మహిళలు నేడు దేశంలో ట్రిపుల్ తలాఖ్ తో ఎంతో వ్యధను చెందుతున్నారు. రాను రాను ఈ ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం వింత పోకడలు పోయి మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోంది.
ఇన్నాళ్లు మౌనంగా సహిస్తూ వచ్చిన ముస్లిం మహిళా లోకం తిరుగుబాటు యుద్దాన్ని లేవదీసి, సుప్రీమ్ కోర్టు తలుపులు తట్టింది. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్ ఫై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి, ఆందోళన కూడా మొదలయింది. సుప్రీమ్ కోర్టు కూడా ఇక వేచి చూసే ఉద్దేశం తమకు లేదని ఈ సమస్యకు పరిష్కారం కనుగోవాల్సిందేనని తేల్చి చెప్పడంతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. నివేదికతో పాటు కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీమ్, రేపో మాపో ఈ సమస్యను కోర్టు ముందు ప్రవేశ పెట్టనుంది. మతం ఏదయినా మానవత్వమే ముందు అన్నది కోర్టు వారి అభిప్రాయం కాబట్టి అక్కడ ముస్లిం మహిళలకు ఊరట లభించే అవకాశం ఉంది. ఐతే ఇది మతపరమైన సున్నిత అంశం కాబట్టి ముస్లిం మత పెద్దలు, వర్గాలు ఎంతవరకు సుప్రీమ్ తీర్పును, సలహాలను ఆహ్వానిస్తాయనేది వేచి చూడాలి.