ఆసియా- పసిఫిక్ దేశాల్లోని వాణిజ్య సముదాయాల పెట్టుబడి మార్కెట్లో హైదరాబాద్ కు ప్రథమ స్థానాన్ని లభించింది. ఈ రంగంలో సింగపూర్, మలేషియా వంటి దేశాలను అధిగమించింది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
బెట్టింగ్ ఆన్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ కోర్ సిటీస్- జూన్ 2017 పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో సుస్థిరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక అభివృద్ధికి అపారమైన అవకాశాల కారణంగా హైదరాబాద్ నంబర్‌వన్ నగరంగా అవతరించిందని 63 ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాల్ని నిర్వహించే ఈ సంస్థ తెలియజేసింది.
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదికలో మొత్తం పది నగరాలను ఎంపిక చేయగా బెంగళూరు,ముంబై వంటి ఇతర భారతీయ నగరాలు ఆరు, ఏడు స్థానాల్లో పుణె,చెన్నై, ఢిల్లీ వంటివి ఎనిమిది,తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. మొదటి ఐదు నగరాల్లో హైదరాబాద్ మినహా మరే భారత నగరానికి చోటు దొరుకలేదు. ప్రథమ స్థానం హైదరాబాద్‌కు లభించగా బ్యాంకాక్(2), మనీలా(3), గ్వాంగ్హు(4), షెంజెన్(5) నగరాలకు తర్వాత స్థానాలు లభించాయి.
ప్రస్తుతం ఇక్కడ నష్టభయం అనేది మచ్చుకైనా కన్పించడం లేదని, వాణిజ్య సముదాయాలకు మునుపటి కంటే మెరుగైన గిరాకీ లభిస్తున్నదని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఎండీ వీరబాబు అభిప్రాయపడ్డారు.